
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ కార్యదర్శి పి.మధు తెలిపారు. మరో నేత బాబూరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూడటం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు హోదా కోసం తామే పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం చంద్రబాబుకు తగదని అన్నారు.
ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు..దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. గతంలోననూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు..హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్ధతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయవద్దని విన్నవించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్నిఅణచివేస్తామనుకోవడం చంద్రబాబు అవివేకమని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment