సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ భేటి చూస్తే రాష్ట్రాన్ని కేంద్రం బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు అన్నారు. అదే నిజమైతే బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ రాజకీయాల్లో తలదూర్చడం మంచిది కాదని సూచించారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గవర్నర్, స్పీకర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హోదా పేరుతో దీక్షలు, హోమాలు చేస్తూ ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కార్యకలాపాలకు చంద్రబాబు వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి దీక్షకు ఎంత ఖర్చు అయ్యిందో, ఎంతమంది విద్యార్థులను, డ్వాక్రా మహిళలను తీసుకువచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు.
దక్షిణాది రాష్ట్రాల వాటాను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మధు పేర్కొన్నారు. రాష్ట్రాల ఆదాయ వనరులు కుచించుకుపోయే విధంగా పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా రేపు(మంగళవారం) సాయంత్రం 7 నుంచి 7.30 వరకు అరగంటపాటు విద్యుత్ నిలిపివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment