P. Madhu
-
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
చంద్రబాబూ.. అలాంటివి మానుకోండి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ భేటి చూస్తే రాష్ట్రాన్ని కేంద్రం బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు అన్నారు. అదే నిజమైతే బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ రాజకీయాల్లో తలదూర్చడం మంచిది కాదని సూచించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గవర్నర్, స్పీకర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హోదా పేరుతో దీక్షలు, హోమాలు చేస్తూ ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కార్యకలాపాలకు చంద్రబాబు వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి దీక్షకు ఎంత ఖర్చు అయ్యిందో, ఎంతమంది విద్యార్థులను, డ్వాక్రా మహిళలను తీసుకువచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల వాటాను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మధు పేర్కొన్నారు. రాష్ట్రాల ఆదాయ వనరులు కుచించుకుపోయే విధంగా పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా రేపు(మంగళవారం) సాయంత్రం 7 నుంచి 7.30 వరకు అరగంటపాటు విద్యుత్ నిలిపివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘బాబూ..కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ఆపు’
పేదల కడుపుకొట్టి పెద్దలకు పరిశ్రమల పేరుతో భూములు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు పరిశ్రమలను అడ్డుకుంటున్నారంటూ శాసనమండలిలో చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని మధు తప్పుబట్టారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, పేదలు, రైతులను దెబ్బతీసి భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించే చర్యలను మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ మందుల కంపెనీకి భూములు ఇవ్వడం వల్ల రైతులు, పేదలు, హేచరీలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. దాదాపు 2094 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుందని, వాటిలో 505 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. 600 మంది రైతులను పోలీసులతో బెదిరించి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుందని, ఇంకా 220మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తీరు వల్ల ఆ ప్రాంతంలో రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసుకున్న సుమారు 250 రొయ్య పిల్లల (సీడ్ ఉత్పత్తి) హేచరీలు మూతపడి 10 వేల మంది ఉపాధిని కోల్పోతారన్నారు. అక్కడ జీడిమామిడి తోటల సాగు జరుగుతోందని, ఎకరానికి ఏడాదికి కనీసం రూ.1.20 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఆ భూమిని లాగేసుకుని రూ.1.80 లక్షల నుంచి రూ.3 లక్షల వరకే ధర నిర్ణయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దివీస్ ప్యాక్టరీ ఏర్పాటుతో సముద్ర జలాలు కలుషితమై చేపలు చనిపోయి మత్స్యకారులు జీవన భతి దెబ్బతింటుందని, గాలి నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యంబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలోను ప్రభుత్వం మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు అనుమతించి ప్రజలు, మత్స్యకారులు, రైతుల జీవనాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. రోజుకు 150 టన్నుల రొయ్యలు ప్రోసెసింగ్ జరిగే ఆక్వా ఫుడ్‌పార్క్ ఏర్పాటుతో వచ్చే వ్యర్థాలవల్ల గొంతేరు డ్రై న్ కాలుష్యం బారిన పడుతుందన్నారు. దీనివల్ల 4 మండలాల్లోని 40గ్రామాలకు కలుషిత నీరు దిక్కవుతుందన్నారు. చిరంజీవి స్వగ్రామం ఉన్న మొగల్తూరు కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకుందని గుర్తు చేశారు. దీన్ని ఆపాలని ప్రజలు అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మంకుపట్టు వదలకుండా పోలీసులను దించి భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. దివీస్ మందుల ఫ్యాక్టరీని కాకినాడ సెజ్ ప్రాంతంలోను, తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్ తీర ప్రాంతంలోను ఏర్పాటుచేసుకోవాలని మధు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు(వైవీ) కూడా పాల్గొన్నారు. -
బాబూ బుద్ధి తెచ్చుకో: మధు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకతాటిపై కదులుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. విభజన హామీల అమలు కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి మధు ప్రారంభించారు. మధు మాట్లాడుతూ చంద్రబాబుకు దిమాగ్ ఖరాబైందని, అందుకే పొంతనలేని మాటలతో అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల ఆందోళనలు అవసరం లేదని, అఖిలపక్షం అక్కర్లేదని చెబుతున్న బాబు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలు, ఆందోళనలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. బంద్ విజయవంతం కారణంగానే ప్రధాని మోదీ నుంచి బాబుకు పిలుపు వచ్చిందనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బంద్ విజయవంతం చేసిన ప్రతిపక్షాలు, ప్రజలను చంద్రబాబు అభినందించాలన్నారు. -
'చంద్రబాబు తీరు దారుణం'
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ ధోరణి అవలంబిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని పిలుపునివ్వడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. నెల్లూరు నగరంలో మంగళవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార ఆర్భాటాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, ప్రజా సంఘాలను చీల్చడం తప్ప... ప్రజలకు చేసిందేమీ లేదని... చంద్రబాబుపై మధు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం ఇతర దేశాలు పట్టుకుని తిరుగుతూ ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తూ ఒక పక్క రైతులు ఆత్మహత్యలు, మరో పక్క బతకలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకుండా ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేయడంతోనే అధికార టీడీపీ కాలం వెళ్ల తీసిందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు. -
ప్రపంచబ్యాంకుకు ఏపీ తాకట్టు
- సీఎం చంద్రబాబు విధానాలపై సీపీఎం మండిపాటు హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు సీఇవోనని గతంలోనే ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు కార్పొరేట్ సంస్థల ఏజెంటుగా మారారని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి మరోసారి 'బ్యాంకు' పాలనకు తెరలేపారని సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ మండిపడింది. 'వివిధ రాష్ట్రాల వ్యాపార సంబంధ సంస్కరణల మదింపు' పేరిట ఈనెల 14న ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో- వ్యాపారానికి ఏపీ రెండో అనువైన రాష్ట్రమంటూ కితాబివ్వడమే అందుకు సాక్ష్యమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నివేదికను తయారు చేసిన మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ బ్యాంకు, కేపీఎంజీ, సీఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలన్నీ ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో నడిచేవని, అవసరానికి మించి భూమిని సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వ్యాపారావకాశాలకు పెద్ద పీట వేయాలని ప్రపంచ బ్యాంకు ఆదేశిస్తే చంద్రబాబు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని మొదలు బోగాపురం, భావనపాడు, మచిలీపట్నం పోర్టు వరకు ప్రతి దానికీ అవసరానికి మించే భూమి సేకరిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రైతుల్ని సమీకరించి చంద్రబాబు నాయుడు ఆట కట్టించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతున్న 7,64,280 ఎకరాలు కాక మరో 8 లక్షల ఎకరాల్ని సేకరించి కార్పొరేట్లకు అప్పగించేందుకే బాబు భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలోని 36 సెజ్‌లలో 9 లక్షల ఎకరాల భూమి ఉందని, దాన్ని ఉపయోగించుకోవడానికి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారని మండిపడ్డారు. -
బూర్జ పోలీస్ స్టేషన్లో సీపీఎం కార్యదర్శి మధు
బూర్జ(శ్రీకాకుళం): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును శ్రీకాకుళం జిల్లా పోలీసులు బూర్జ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనను కలిసేందుకు వెళ్లిన జిల్లా పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి, మరో నేత వడ్డేపల్లి మోహన్‌రావును లోపలికి అనుమతించి, వారినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సీపీఎం కార్యకర్తలు 20 మందితోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు, సీఐటీయూ నేత నాగమణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని పొలాకిలో నిర్మించతలపెట్టిన ధర్మల్ విద్యుత్ శాఖ కేంద్రానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన మధును బుధవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఆముదాలవలసలో అరెస్టు చేసిన విషయం విదితమే. -
చంద్రబాబు పచ్చి మోసగాడు: మధు
తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసగాడని, ఓటుకు నోటు వ్యవహారంలో అతడిపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, భూమి లేని, కౌలురైతులకు నెలవారీ పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయకూలీలు, కౌలురైతులు, డ్వాక్రా మహిళలు, వృత్తిదారులను చంద్రబాబు నమ్మించి మోసగించారని దుయ్యబట్టారు. నెలవారీ పింఛన్, కౌలు పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకని నిలదీశారు. వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిన్నింగ్ మిల్లుకు సంబంధించి కోట్ల రుపాయల బకాయిలను రద్దు చేశారని ఆరోపించారు. పేదలకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని, ఇది దగాకోరు ప్రభుత్వమని అభివర్ణించారు. రాజధాని ప్రజల సమస్యలపై ఈ నెల 9న అన్ని వామపక్షాలు విజయవాడలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అనంతరం లక్షమంది మహిళలతో మహోద్యమం చేపడతామని, చంద్రబాబు సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయకమిటీ కన్వీనర్ సిహెచ్.బాబురావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం చేయకపోతే చంద్రబాబు సహా మంత్రులను గ్రామాల్లో తిరగనీయబోమని చెప్పారు. వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవి, సీపీఎం మంగళగిరి డివిజన్ కార్యదర్శి జె.వి.రాఘవులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సీపీఎం నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, జె.నవీన్‌ప్రకాష్, ఈమని అప్పారావు, జయప్రకాష్ పాల్గొన్నారు. -
విజయవాడకు సీపీఎం కార్యాలయం
బరువెక్కిన హృదయాలు, భారంగా వీడ్కోలు హైదరాబాద్: బరువెక్కిన హృదయాలు, ఆత్మీయ ఆలింగనాల మధ్య సీపీఎం ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, పార్టీ కార్యాలయం శుక్రవారం నూతన రాష్ట్ర రాజధాని విజయవాడకు తరలింది. రాష్ట్ర విభజనతో అన్ని పార్టీల కన్నా ముందే వేర్వేరు శాఖల్ని ఏర్పాటు చేసుకున్న సీపీఎం కార్యాలయ తరలింపులోనూ ముందే నిలిచింది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జాతీయోద్యమ సమయంలో విజయవాడ నుంచే కమ్యూనిస్టు ఉద్యమ కార్యక్రమాలు సాగేవి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మద్దుకూరి చంద్రం వంటివారు అనేక పోరాటాలకు ఊపిరిలూదింది విజయవాడలోనే. ప్రస్తుత ఏపీ కార్యదర్శి పి.మధు, పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్మించిన మాకినేని బసవ పున్నయ్య భవన్ 1992 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా మారింది. కార్యాలయం తరలింపు సందర్భంగా తెలంగాణ నాయకత్వం ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ సీనియర్ నేత పర్సా సత్యనారాయణ మరణంతో దాన్ని సంతాప సభగా మార్చారు. రాఘవులు, వై.వెంకటేశ్వరరావు, కృష్ణయ్య, వంగల సుబ్బారావు, జయరాంతో పాటు తెలంగాణ నేతలు తమ్మినేని వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు. ఆ అనుబంధం తెగింది: మధు అనివార్య కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాలేక పోయిన ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ తెలంగాణ, పాతబస్తీ, హైదరాబాద్ ప్రజలతో తన అనుబంధం తెగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి వారితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. తన చేతులతో కట్టిన భవనాన్ని ఖాళీ చేసి వస్తున్నామన్న బాధ లేదని, అన్యాయంపై పోరాడే తమ సోదరుల ఉద్యమాలకు కేంద్రంగా భాసిల్లుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఎత్తుగడల్లో చిత్తయ్యాం!
సీపీఎం నాయకత్వంపై జిల్లా పార్టీల నేతల ధ్వజం విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయటంలో దొర్లిన పొరపాట్లు, పార్టీల ఎత్తుగడలతో తీవ్రంగా నష్టపోయినట్లు సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిర్వేదం వ్యక్తమైంది. విజయవాడ సిద్దార్ధ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ ఆంధ్రప్రదేశ్ తొలి మహాసభల్లో దాదాపు అన్ని జిల్లాల నేతలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ’రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయిపోతున్నాం. అదును తప్పి అంచనాలు వేస్తున్నాం. మనం ఎన్ని చెప్పినా పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు ఎన్నికలనే కొలమానంగా ప్రజలు భావిస్తున్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన సమయంలో తప్పిదాలు చేస్తున్నాం. అవసరం లేనప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నాం. ఇంకెంత కాలం ఇలా?’ అని వివిధ జిల్లాల ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రవేశపెట్టిన రాజకీయ, నిర్మాణ నివేదికపై జరిగిన చర్చలో వారంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ అర్బన్ సహా జిల్లాల నేతలంతా 2014 ఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించినట్టు తెలిసింది. ఇలా అయితే ఎలా ఆదరిస్తారు? ‘2014 ఎన్నికల్లో అనుసరించిన ఎత్తుగడలు పార్టీకి తోడ్పడకపోగా తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని జేఎస్పీతో ఎన్నికల అవగాహనతో నిష్ర్పయోజనమే మిగిలింది. పార్టీ వ్యవహార శైలి శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించింది. సాంప్రదాయంగా వచ్చే ఓట్లు కూడా రాలేదు. కులం, మతం, డబ్బు తదితర అంశాల ప్రభావం చివరకు పార్టీ ఓటర్ల మీద కూడా పడింది. చివరకు పార్టీ పునాదులే కదిలిపోయాయి’ అని మహాసభల్లో నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. ఔను తప్పు జరిగింది: మధు ఎన్నికలు- ఎత్తుగడల పంథాపై వచ్చిన విమర్శలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు జవాబిస్తూ ఇందులో లోపం జరిగినట్టు అంగీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వామపక్షాల ఐక్యతకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ప్రయత్నించాల్సి వచ్చిందని, ఇది సమష్టి నిర్ణయమేనని వివరించారు. పార్టీకి నష్టం జరిగిందని అంగీకరించిన ఆయన ఇక ముందు అలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పార్టీకి పూర్వ వైభవం తెద్దామన్నారు. రైతుల పక్షాన పోరాడతాం: ఏచూరి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దతలేదని ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంటులో ప్రతిఘటిస్తామని అన్నారు. రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి రైతులు డి.బాలాజీరెడ్డి, అంకమరెడ్డి, ఆదియ్య, వీరస్వామి, రామిరెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో సీపీఎం మహాసభల్లో పాల్గొన్న ఏచూరిని సోమవారం రాత్రి కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు తమను భయాందోళనలకు గురిచేస్తోందని తెలిపారు. ఏచూరి స్పందిస్తూ.. పార్లమెంటు లో సుదీర్ఘ చర్చ తరువాత భూ సేకరణ చట్టం వచ్చిందని, దాన్ని అమలు చేయకుండా.. రైతులు, కూలీలకు కీడు చేసేలా ల్యాండ్ పూలింగ్ను అమలు చేయడం సరికాదన్నారు. భూ సేకరణ చ ట్టానికి సవరణలతో ఆర్డినెన్సు తెచ్చి మోదీ ప్రభుత్వం బాబుకు మేలు చేసిందని విమర్శించారు. -
రుణమాఫీపై శ్వేతపత్రానికి సీపీఎం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. తొలి విడత ఖాతాల్లో ఎంతమందికి రుణమాఫీ అమలు జరిగిందో వివరించాలని కోరింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఇంతవరకు ఎంత మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశారో, రెండో విడతలో ఎంతమొత్తంలో మాఫీ చేయబోతున్నారో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. బినామీ రుణాలు పేరిట సహకార బ్యాంకుల్లో 400 కోట్లు, వాణిజ్య బ్యాంకుల్లో 400 కోట్ల రూపాయల మాఫీ జరగలేదు. ‘రాజధాని ప్రాంత రైతులకు కూడా నామమాత్రంగానే విడుదల అయ్యాయి. రుణమాఫీకి సంబంధించి జీవో విడుదల చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తొలివిడత ప్రక్రియే పూర్తి కాలేదు. పెండింగ్‌లో 43 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ వర్గాలే తెలుపుతున్నాయి. కౌలురైతులకు, రైతుమిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూపు సభ్యులన్నింటికీ కలిపి ఎంత రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం వద్దనే లెక్కలు లేవు. సన్న,చిన్నకారు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వొనగూడిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా గందరగోళానికి తెరదించి స్పష్టత ఇవ్వండి. రుణమాఫీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి’ అని మధు కోరారు. -
బాబుది అధికార దాహం: పి.మధు
సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ధ్వజం చంద్రబాబుకు నిలకడైన సిద్ధాంతం లేదు.. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు పొత్తెలా పెట్టుకుంటారు? సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహంతో అల్లాడుతున్నారని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. బాబుకు నిలకడైన సిద్ధాంతం లేదన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గోద్రా సంఘటన అనంతరం నరేంద్రమోడీని తిట్టి, ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుకు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీజేపీ ఉంటే తప్ప మనుగడ లేదన్న భావన చంద్రబాబులోనే ఉంటే సామాన్య కార్యకర్తలకు ఏం భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. మునిగిపోతున్న టీడీపీ గడ్డిపోచను పట్టుకుని బయటపడాలని చూస్తోందని చమత్కరించారు. చంద్రబాబు రోడ్ షోల పేరుతో జనసమీకరణ చేసినా, సాధారణ ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత కల్పించలేకపోతున్నారని చెప్పారు. అన్ని పదవులూ అనుభవించిన జేసీ దివాకర్‌రెడ్డి, పురందేశ్వరీ, రాయపాటి వంటి వారు మళ్లీ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వదలాలని సీపీఐకి సలహా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ ఎవర్ని ఓడించాలని చూస్తోందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్నది వామపక్షాల విధానం. దాన్ని పక్కన బెట్టినప్పుడు కాంగ్రెస్‌తోనే ఎందుకు? బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు. ఆ పార్టీ కూడా తెలంగాణ కోసం పోరాడినదే గదా! ఈ రెండూ కార్పొరేట్లకు ఊడిగం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. ఈ విషయాలన్నీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న వారికి తెలియదా? ఇది మౌలిక సిద్ధాంతంతో రాజీ పడటం, రాజ కీయ దివాళాకోరుతనమే’ అని అన్నారు. వైఎస్సార్సీపీపై మైనారిటీల ఆశలు బీజేపీ, టీడీపీల వైఖరితో విసిగిన ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైఎస్ కుమారుడైన జగన్ వారికి రక్షణగా ఉంటారని భావిస్తున్నారని తెలిపారు. అయితే, జగన్ ఇటీవలి కాలంలో నరేంద్రమోడీని, బీజేపీని ఒక్క మాట అనకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదన్నారు. దాదాపు 300 లోక్‌సభ స్థానాల్లో అస్థిత్వమే లేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీతో పొత్తుకు తమకు అభ్యంతరం లేదని, తాము చేసిన అనేక పోరాటాల్లో విజయమ్మ సహా అనేకమంది వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారని తెలిపారు.