రుణమాఫీపై శ్వేతపత్రానికి సీపీఎం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. తొలి విడత ఖాతాల్లో ఎంతమందికి రుణమాఫీ అమలు జరిగిందో వివరించాలని కోరింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఇంతవరకు ఎంత మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశారో, రెండో విడతలో ఎంతమొత్తంలో మాఫీ చేయబోతున్నారో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.
బినామీ రుణాలు పేరిట సహకార బ్యాంకుల్లో 400 కోట్లు, వాణిజ్య బ్యాంకుల్లో 400 కోట్ల రూపాయల మాఫీ జరగలేదు. ‘రాజధాని ప్రాంత రైతులకు కూడా నామమాత్రంగానే విడుదల అయ్యాయి. రుణమాఫీకి సంబంధించి జీవో విడుదల చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తొలివిడత ప్రక్రియే పూర్తి కాలేదు. పెండింగ్‌లో 43 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ వర్గాలే తెలుపుతున్నాయి.
కౌలురైతులకు, రైతుమిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూపు సభ్యులన్నింటికీ కలిపి ఎంత రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం వద్దనే లెక్కలు లేవు. సన్న,చిన్నకారు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వొనగూడిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా గందరగోళానికి తెరదించి స్పష్టత ఇవ్వండి. రుణమాఫీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి’ అని మధు కోరారు.