
వామపక్ష నాయకులను వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.