K. Ramakrishna
-
పెట్రో ధరలపై 14న అమిత్ షాకు నిరసన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న తిరుపతి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలా కంటి తుడుపుగా రూ.5 తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటే లీటర్ పెట్రోల్‌ను రూ.70–75కు, డీజిల్‌ను రూ.55–60కు అందించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని, పెరిగితేనే.. పెరుగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయిన 2014లో లీటర్ పెట్రోల్ సగటు ధర రూ.72 కాగా, ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 93 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పుడు 82 డాలర్లు మాత్రమేనని.. అయినా 2021 నవంబర్ 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.116కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 11 డాలర్లు తగ్గినా పెట్రోల్ ధరను రూ.44 పెంచారని మండిపడ్డారు. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.47గా ఉన్నదాన్ని రూ.109కి పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.44 పెంచి రూ.5 తగ్గించిందని, డీజిల్‌పై రూ.61 పెంచి రూ.10 తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన ఆర్థిక నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని నిరసించాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు రామకృష్ణ పేర్కొన్నారు. -
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
‘టీడీపీ నేతలూ.. బంద్‌లో పాల్గొనండి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని, బడ్జెట్లోనూ మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. బంద్‌కు సహకరించాలని అన్ని పార్టీలను కోరామని, కాంగ్రెస్ నుంచి మద్దతు లభించిందని తెలిపారు. ఇతర పార్టీల నాయకులతో మాట్లాడుతున్నామని, ఈరోజు సాయంత్రానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలు, వ్యాపారులు, మేధావులు అందరూ స్వచ్ఛంద బంద్‌లో పాల్గొనాలని కోరారు. బంద్‌ను అడ్డుకోకుండా ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. -
8న ఏపీ బంద్
సాక్షి, అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్, జి.ఓబుళేసుతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం బిల్లులో రాష్ట్రానికి చేకూర్చాల్సిన లబ్ధిని బడ్జెట్లో ప్రస్తావించకుండా అన్ని రంగాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. విశాఖ రైల్వే జోన్, పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అంశాల ఊసెత్తలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నాబార్డ్ నుంచి, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు ఇప్పిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఒక్క మాట మాట్లడలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ విషయంపై పది వామపక్ష పార్టీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో మాట్లాడామన్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రజాసంఘాలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సహకరించాలని కోరారు. -
హక్కుల హరణంలో ఇద్దరు చంద్రుల పోటీ
సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ హైదరాబాద్: ఓ పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. హక్కులను కాలరాయడంలో ఇద్దరు చంద్రులు తెగ పోటీపడుతున్నారన్నారు. వీరిద్దరూ అనుసరిస్తున్న విధానాలు దాదాపు ఒక్కటేనన్నారు. ‘సేవ్ ధర్నాచౌక్’ పేరుతో మఖ్దూం భవన్ వద్ద చేస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. చేతి వృత్తిదారుల సంఘ కార్యకర్తలు పాల్గొన్న దీక్షను మంగళవారం రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇరువురు సీఎంలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, కుటుంబ పాలనకు అలవాటుపడి రాష్ట్రాల సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఏపీలో పనికిమాలిన ప్రభుత్వముందని, చంద్రబాబు 1.5 లక్షలSఉద్యోగాలను, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ధర్నాచౌక్‌లో ఒకప్పుడు తెలంగాణ కోసం జరిగిన నిరసనలు, సభలు, సమావేశాలలో పాల్గొన్న కేసీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం విచిత్రంగా ఉందన్నారు. సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు, చేతివృత్తిదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి కె.గోవర్దన్, బీసీ సాధన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.పాండురంగాచారి, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల దృష్టిలో ఇద్దరూ మోసగాళ్లే
- కేంద్ర నిధులపై వారిద్దరివీ విరుద్ధ ప్రకటనలు - బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా బంద్ విజయవంతం కావాలి - చంద్రబాబు అండతోనే మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు - బి-కేటగిరి సీట్ల భర్తీలో లొసుగులపై 11న చర్చకు మంత్రి కామినేని సిద్ధమా? - మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం సాక్షి, అమరావతి(గుంటూరు జిల్లా) రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అవకాశవాదంగా వ్యవహరిస్తున్న కేంద్ర వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల దృష్టిలో మోసగాళ్లుగానే మిగిలిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పునరుద్ఘాటించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. హోదా, ప్యాకేజీలు అంటూ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు, వెంకయ్యలు ఇద్దరూ ఇంకా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రూ.2.25 లక్షల కోట్లు లబ్ధి అని వెంకయ్యనాయుడు, కేంద్రం రూ.8,364 కోట్ల 54 లక్షలు ఇచ్చిందని చంద్రబాబు ఇచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు శుక్రవారం ఒక పత్రిక మొదటి పేజీలో వచ్చాయని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా శనివారం నిర్వహించే రాష్ట్ర బంద్‌ను ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు మెడికల్ సీట్ల భర్తీలోను అక్రమాలకు అవకాశం ఇచ్చారని రామకృష్ణ ఆరోపించారు. కౌన్సెలింగ్‌పై సెప్టెంబర్ 2న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు 3, 4 తేదీల్లో సీట్ల భర్తీ చేపట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 371-డి ప్రకారం రాష్ట్ర విద్యార్థులకే బి-కేటగిరి మెడికల్ సీట్లు కేటాయించాలన్న నిబంధనను కాదని 50 శాతం పైగా ఇతర రాష్ట్రాల వారికి సీట్లు అమ్ముకోవడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోనే అడ్డగోలుగా సీట్ల కేటాయింపు చేపట్టడం దారుణమన్నారు. మరోవైపు తెలంగాణ ఎంసెట్ ఈ నెల 11న నిర్వహించనున్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఏపీలో బి-కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టం వెనుక ప్రభుత్వ దన్ను ఉందని ఆరోపించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అవతవకలు, అక్రమాలపై ఈ నెల 11న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చకు మంత్రి కామినేని శ్రీనివాస్ సిద్ధమా? అని రామకృష్ణ సవాలు విసిరారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు జల్లి విల్సన్, జి.ఓబులేషు, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్లు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు
-
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు
♦ నేడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన ♦ సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపు సాక్షి,హైదరాబాద్: కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను వంచించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ.. అసలు ప్యాకేజీయే కాదని కొట్టిపారేశారు. బడ్జెట్ లోటుని ఎవరు పూర్తి చేస్తారో వివరణే లేదన్నారు. కొండ ప్రాంతాలకే ప్రత్యేక హోదా ఇస్తారని అరుణ్ జైట్లీకి ఇప్పడు తెలిసిందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పార్టీ శ్రేణులకు రామకృష్ణ పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేది
- సీపీఐ నేత కే. రామకృష్ణ విజయవాడ (గాంధీనగర్) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో హనుమాన్‌పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తొలుత కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, దోనేపూడి శంకర్ రక్తదానం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇస్తే.. తాము రక్తాన్ని ఇస్తున్నామన్నారు. రక్తాన్ని మోడీకి పంపి ఆయన కళ్లు తెరిపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించాలని, రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. హోదా, విభజన హామీలపై మంత్రుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామన్నారు. నియోజకవర్గాల్లో తిరగనియ్యబోమన్నారు. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్రమంతట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలియజేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, డాక్టర్ శర్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి లెనిన్‌బాబు, సయ్యద్ అఫ్సర్, మహిళా సమాఖ్య నాయకులు దుర్గాంబ పాల్గొన్నారు. -
సీఎంను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి
- లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గుంటూరు వెస్ట్ ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం అమలుచేయాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. తద్వారా ఎన్నికల్లో కొంతమేర ధనప్రవాహం తగ్గుతుందని చెప్పారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ‘ఎన్నికల్లో ధనప్రభావం.. పర్యవసానాలు.. ప్రజాస్వామ్య భవిష్యత్’ అంశంపై సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని, మంచి నాయకత్వం రావాలని చెప్పారు. పశ్చిమబెంగాల్, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో ఎన్నికల్లో ధనప్రవాహం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిని వ్యాపార ధోరణిలో చూస్తున్నారని, ఈక్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పోటీకి దిగుతున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టి పోటీకి దిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా చాలావరకు ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నిరోధించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని చెప్పారు. జెండాలు మోసిన పార్టీ కార్యకర్తలను పక్కనపెట్టి డబ్బున్న వాళ్లకే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని విమర్శించారు. చదువుకున్నవారు సైతం సిగ్గు లేకుండా పోస్టల్ బ్యాలెట్లను అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర సమితి నాయకుడు ఎస్.హనుమంతరెడ్డి, ప్రొఫెసర్ విశ్వనాథ్, ఆప్ నాయకుడు టి.సేవాకుమార్, రాఘవాచారి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘ప్రత్యేక హోదాపై ఈనెల 5లోగా తేల్చాలి’
ప్రత్యేక హోదాపై ఈ నెల 5వ తేదీలోగా అటో ఇటో తేల్చాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పకుండా ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతున్న 11 రాజకీయ పార్టీల ప్రతినిధులను కలవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం నిర్వహించిన బంద్‌కు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీకి భయపడే బంద్ చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయించారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను వేల సంఖ్యలో అరెస్ట్ చేసినా బంద్ విజయవంతమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్‌కు స్పందించే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడానికి అంగీకరించారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రూ. 1.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రంలో మరో కుట్ర జరుగుతుందన్నారు. హోదా తప్ప ఇంకేదీ తమకు అంగీకారం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఈ నెల 5న పార్లమెంట్లో చర్చకు వస్తున్న నేపథ్యంలో హోదా సాధన సమితి, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. -
అక్రమ అరెస్టులతో ‘హోదా’ను ఆపలేరు
‘‘ప్రజలు ఆకాంక్షిస్తున్న ప్రత్యేక హోదాను అక్రమ అరెస్టులతో ఆపలేరు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఒకవైపు రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే.. మరోవైపు శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. చంద్రబాబు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దారుణం’’ - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
మోదీజీ ...మొండి చెయ్యి చూపకండి : సీపీఐ
విజయవాడ,(వన్‌టౌన్) : ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను అమలు చేయకుండా తెలుగు ప్రజలకు మొండిచెయ్యి చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ‘గడపగడపకూ సీపీఐ’ కార్యక్రమాన్ని స్థానిక కృష్ణవేణి షాపింగ్ కాంప్లెక్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూపీఐ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడటం బూర్జువా పార్టీలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు హోదాకు మించిన ప్యాకేజీలు ఇస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రత్యేక హోదాతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, పోల వరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు లేని విజయవాడను ఊహించజాలమన్నారు. బూర్జువా పార్టీల మాదిరిగా కోట్ల రూపాయలను వెచ్చించి కార్యక్రమాలు చేసే శక్తి కమ్యూనిస్టుపార్టీకి లేదన్నారు. అందుకే ఇంటింటికీ తిరిగి వసూలు చేసిన విరాళాలతోనే కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర సహాయ కార్యదర్శి జీ కోటేశ్వరరావు, నేతలు పల్లా సూర్యరావు,ఎల్దుర్గారావు, శ్రీనివాసు, యాకోబు, డీవీ రమణబాబు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఏమి ఇచ్చారని సభ నిర్వహిస్తున్నారు: సీపీఐ
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ మతోన్మాద శక్తులకు అండగా నిలుస్తున్న హిందూ తాలిబన్లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందని సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం అమలు చేయలేదని మండిపడ్డారు. శాసన సభలో ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. దేశంలో స్వేచ్ఛ కావాలని కోరిన కన్నయ్య కుమార్‌ను చంపితే రూ.11 లక్షలు, నాలుక కోస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ప్రకటించడం మతోన్మాదం తలకెక్కి చేసిన చర్యగా అభివర్ణించారు. -
చంద్రబాబు దిగజారిపోయారు: కె.రామకృష్ణ
చంద్రబాబు తాను చెప్పిన మాట మీద నిలబడలేనంతగా దిగజారిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సైకిల్ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో చేరిన వారిని ఓడించాలని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన చంద్రబాబు... పది రోజులు కూడా గడవకముందే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం దిగజారుదుతనానికి నిదర్శనమన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పేర్చకముందే వేల కోట్ల రూల భూ కుంభకోణం బయటపడిందన్నారు. దాన్ని సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు సమర్థించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబుకు రాయలసీమ అభివృద్ధి కానీ, ఇక్కడి కరువు, ఆత్మహత్యలు గానీ పట్టడం లేదని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. -
చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమా
- విజయవాడ చంద్రబాబు జాగీరు కాదు - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ (లబ్బీపేట) చంద్రబాబు ప్రభుత్వం చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, నెల్లూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిత్రతో పాటు మిగిలినవారికి ఏం జరిగినా చంద్రబాబు, మంత్రి కామినేనిలు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైద్య మిత్రలు అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చేరారని వార్తలు రావడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వైద్య మిత్ర తనకు గుండె జబ్బు ఉందని, అయినా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆయన ముందు కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, టైస్టులపై వ్యవహరించే రీతిలో తమతో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రామకృష్ణ స్పందిస్తూ.. విజయవాడ చంద్రబాబు జాగీరు కాదని, నగరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నంత మాత్రాన పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు కూడా జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య మిత్రాలను స్టేషన్లకు తరలించారని, వారికి ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. -
హోదా కోసం సమర శంఖం
విశాఖ చేరుకున్న సీసీఐ బస్సు యాత్ర నేతలకు ఘన స్వాగతం బహిరంగ సభలో {పభుత్వాల తీరుపై నిప్పులు చెరిగిన నాయకులు విశాఖపట్నం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళంలో మొదలైన బస్సుయాత్ర ఆదివారం విశాఖకు చేరుకుంది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖను విద్య, పారిశ్రామికపరంగా అభివృద్ధి చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు సీపీఐ నేతలు ఉంచారు. విశాఖ చేరుకున్న నేతలకు పార్టీ నగర కార్యదర్శి డి.మార్కండేయులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలు సంఘాలు నేతలను సన్మానాలతో ముంచెత్తారు. పది రూపాయల నోట్లతో చేసిన దండలు వేశారు. ఈ సందర్భంగా జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నాయకులు ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రత్యేక హోదా తీసుకురాకపోతే 11వ తేదీన జగిగే బంద్‌లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. రూ.23వేల కోట్లు ప్యాకేజీ అడిగితే జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటే మన ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. విశాఖ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు చెబుతున్న మాటలకు, కేంద్ర మంత్రులు చెబుతున్న వాటికి పొంతన ఉండటం లేదని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌చేశారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు కేంద్రమే నిర్మించాల్సి ఉండగా సింగపూర్ దగ్గర దేవులాడటం ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ బదులు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఇవ్వాలన్నారు. చంద్రబాబు రైతు సమస్యలు పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్ధి జేఏసీ చైర్మన్ లగుడు గోవిందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంధ్రనాధ్, బెటర్ విశాఖ ఫోరం అధ్యక్షుడు సీఎస్‌రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబు, రాష్ర్ట మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరిముల్ల, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, ఏఐవైఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్.సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ మత్సకార కార్మిక సంఘం నాయకుడు వై. నందన్న, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు
విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సబ్-కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన పికెటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దగాకోరు ప్రభుత్వంపై పోరాటం ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు ప్రధాన హామీలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు.. ఆచరణలో అమలు చేయటానికి రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు, వాటిని అమలు చేయటం సాధ్యం కాదని కొందరు చెప్పినా చంద్రబాబు బుకాయించారన్నారు. తొలిసంతకం రుణమాఫీ ఫైలుపై పెట్టి, రైతుసాధికారిత సంస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు కనీసం ఒక్కరైతుకు, లేదా డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేయలేదన్నారు. రాష్టాన్ని సింగపూర్ చేస్తానని సరికొత్త హామీలు చేశారన్నారు. హామీల అమలు కోసం సీపీఐ పోరాటాన్ని ఉధ్రుతం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్జీ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే పోరాటాలకు వెనుకాడేది లేదన్నారు.పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రుణమాఫీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాజర్‌వలి, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, చలసాని రామారావు, దోనేపూడి శంకర్, టి.వి.రమణమూర్తి, మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గాభవాని, ఏఐటీయూసీ నాయకుడు చలసాని అజయ్‌కుమార్, ఏఐవైఎఫ్ నాయకుడు నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సబ్-కలెక్టరేట్ వద్ద జరిగిన పికెటింగ్ కార్యక్రమం సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపండి: సీపీఐ
తెలంగాణకు వేరే చోట నుంచి విద్యుత్ ఇవ్వాలని సూచన హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ఆపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. రాయలసీమలోని మెట్టప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు శ్రీశైలం నుంచి వెళుతున్న 350 మెగావాట్ల విద్యుత్‌ను వేరేచోట నుంచి సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన ఆదివారం లేఖ రాశారు. శ్రీశైలం రిజర్వాయర్‌పై ఆధారపడి నిర్మించిన తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాల్వ, హింద్రీ-నీవా, గాలేరు-నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టులకు నీరు అందించాల్సి ఉందని లేఖలో వివరించారు. అయితే విద్యుత్ అవసరాలకోసం అటు తెలంగాణ, ఇటు ఏపీ పెద్దఎత్తున నీటిని వినియోగిస్తున్నందున రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోతోందని తెలిపారు. రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం కొనసాగాలంటే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి ఉన్నా.. అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేనందున ఏపీ ప్రభుత్వమే ఆ 350 మెగావాట్ల విద్యుత్‌ను వేరేచోట నుంచి సరఫరా చేయాలని ఆయన సూచించారు. -
కీలకాంశాలపై స్పష్టత ఏదీ?
ప్రభుత్వంపై సీపీఐ ధ్వజం హైదరాబాద్: రుణమాఫీ సహా రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై స్పష్టత ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర సమితి విమర్శించింది. ఎన్నికల వాగ్దానాల అమలు, రాష్ట్ర బడ్జెట్, రాజధాని ఎంపిక పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి బదులు అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారని ఆక్షేపించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది ఎదురుచూస్తున్న రుణమాఫీని ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పడానికి బదులు హామీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతోందని శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రూ.1,11,824 కోట్లతో బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెట్టిందని ప్రశ్నించారు. మాజీ శాసనసభ్యులకు నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వడానికి డబ్బుల్లేవన్న ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను లక్ష రూపాయలకు ఎలా పెంచిందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై అఖిల పక్షంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. వారికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు. -
రుణమాఫీ చేయకుండానే సంబరాలా ?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై మొదటి సంతకం చేస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు... ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. కానీ రుణమాఫీ చేసినట్లు పచ్చ పార్టీ నేతలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని కొత్తపేటలో సీపీఐ కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు రుణాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి... వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. -
అహ్లూవాలియా ప్రపంచబ్యాంకు ఏజెంటు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ అర్హమైనది కాదంటూ ప్రణాళికా సంఘం పేర్కొనడాన్ని సీపీఐ ఆక్షేపించింది. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఫిబ్రవరి 21న నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతారా అని ప్రశ్నించింది. ప్రణాళికా సంఘం చైర్మన్‌గా వ్యవహరించిన అహ్లూవాలియా పక్షపాతంతో వ్యవహరించారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.