- కేంద్ర నిధులపై వారిద్దరివీ విరుద్ధ ప్రకటనలు
- బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా బంద్ విజయవంతం కావాలి
- చంద్రబాబు అండతోనే మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు
- బి-కేటగిరి సీట్ల భర్తీలో లొసుగులపై 11న చర్చకు మంత్రి కామినేని సిద్ధమా?
- మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
సాక్షి, అమరావతి(గుంటూరు జిల్లా)
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అవకాశవాదంగా వ్యవహరిస్తున్న కేంద్ర వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల దృష్టిలో మోసగాళ్లుగానే మిగిలిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పునరుద్ఘాటించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. హోదా, ప్యాకేజీలు అంటూ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు, వెంకయ్యలు ఇద్దరూ ఇంకా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రూ.2.25 లక్షల కోట్లు లబ్ధి అని వెంకయ్యనాయుడు, కేంద్రం రూ.8,364 కోట్ల 54 లక్షలు ఇచ్చిందని చంద్రబాబు ఇచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు శుక్రవారం ఒక పత్రిక మొదటి పేజీలో వచ్చాయని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా శనివారం నిర్వహించే రాష్ట్ర బంద్‌ను ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు.
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు మెడికల్ సీట్ల భర్తీలోను అక్రమాలకు అవకాశం ఇచ్చారని రామకృష్ణ ఆరోపించారు. కౌన్సెలింగ్‌పై సెప్టెంబర్ 2న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు 3, 4 తేదీల్లో సీట్ల భర్తీ చేపట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 371-డి ప్రకారం రాష్ట్ర విద్యార్థులకే బి-కేటగిరి మెడికల్ సీట్లు కేటాయించాలన్న నిబంధనను కాదని 50 శాతం పైగా ఇతర రాష్ట్రాల వారికి సీట్లు అమ్ముకోవడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోనే అడ్డగోలుగా సీట్ల కేటాయింపు చేపట్టడం దారుణమన్నారు. మరోవైపు తెలంగాణ ఎంసెట్ ఈ నెల 11న నిర్వహించనున్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఏపీలో బి-కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టం వెనుక ప్రభుత్వ దన్ను ఉందని ఆరోపించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అవతవకలు, అక్రమాలపై ఈ నెల 11న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చకు మంత్రి కామినేని శ్రీనివాస్ సిద్ధమా? అని రామకృష్ణ సవాలు విసిరారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు జల్లి విల్సన్, జి.ఓబులేషు, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌లు పాల్గొన్నారు.