
సాక్షి, అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్, జి.ఓబుళేసుతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం బిల్లులో రాష్ట్రానికి చేకూర్చాల్సిన లబ్ధిని బడ్జెట్‌లో ప్రస్తావించకుండా అన్ని రంగాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు.
విశాఖ రైల్వే జోన్, పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అంశాల ఊసెత్తలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నాబార్డ్ నుంచి, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు ఇప్పిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఒక్క మాట మాట్లడలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ విషయంపై పది వామపక్ష పార్టీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో మాట్లాడామన్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రజాసంఘాలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సహకరించాలని కోరారు.