- సీపీఐ నేత కే. రామకృష్ణ
విజయవాడ (గాంధీనగర్)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో హనుమాన్‌పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తొలుత కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, దోనేపూడి శంకర్ రక్తదానం చేశారు.
రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇస్తే.. తాము రక్తాన్ని ఇస్తున్నామన్నారు. రక్తాన్ని మోడీకి పంపి ఆయన కళ్లు తెరిపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించాలని, రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. హోదా, విభజన హామీలపై మంత్రుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామన్నారు. నియోజకవర్గాల్లో తిరగనియ్యబోమన్నారు. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్రమంతట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలియజేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, డాక్టర్ శర్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి లెనిన్‌బాబు, సయ్యద్ అఫ్సర్, మహిళా సమాఖ్య నాయకులు దుర్గాంబ పాల్గొన్నారు.