ప్రత్యేక హోదాపై ఈ నెల 5వ తేదీలోగా అటో ఇటో తేల్చాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పకుండా ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతున్న 11 రాజకీయ పార్టీల ప్రతినిధులను కలవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం నిర్వహించిన బంద్‌కు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీకి భయపడే బంద్ చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయించారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను వేల సంఖ్యలో అరెస్ట్ చేసినా బంద్ విజయవంతమైందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్‌కు స్పందించే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడానికి అంగీకరించారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రూ. 1.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రంలో మరో కుట్ర జరుగుతుందన్నారు. హోదా తప్ప ఇంకేదీ తమకు అంగీకారం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఈ నెల 5న పార్లమెంట్‌లో చర్చకు వస్తున్న నేపథ్యంలో హోదా సాధన సమితి, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.