- లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ
గుంటూరు వెస్ట్
ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం అమలుచేయాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. తద్వారా ఎన్నికల్లో కొంతమేర ధనప్రవాహం తగ్గుతుందని చెప్పారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ‘ఎన్నికల్లో ధనప్రభావం.. పర్యవసానాలు.. ప్రజాస్వామ్య భవిష్యత్’ అంశంపై సదస్సు జరిగింది.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని, మంచి నాయకత్వం రావాలని చెప్పారు. పశ్చిమబెంగాల్, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో ఎన్నికల్లో ధనప్రవాహం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిని వ్యాపార ధోరణిలో చూస్తున్నారని, ఈక్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పోటీకి దిగుతున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టి పోటీకి దిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా చాలావరకు ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నిరోధించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని చెప్పారు. జెండాలు మోసిన పార్టీ కార్యకర్తలను పక్కనపెట్టి డబ్బున్న వాళ్లకే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని విమర్శించారు. చదువుకున్నవారు సైతం సిగ్గు లేకుండా పోస్టల్ బ్యాలెట్లను అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర సమితి నాయకుడు ఎస్.హనుమంతరెడ్డి, ప్రొఫెసర్ విశ్వనాథ్, ఆప్ నాయకుడు టి.సేవాకుమార్, రాఘవాచారి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు.