హక్కుల హరణంలో ఇద్దరు చంద్రుల పోటీ
సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ
హైదరాబాద్: ఓ పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. హక్కులను కాలరాయడంలో ఇద్దరు చంద్రులు తెగ పోటీపడుతున్నారన్నారు. వీరిద్దరూ అనుసరిస్తున్న విధానాలు దాదాపు ఒక్కటేనన్నారు. ‘సేవ్ ధర్నాచౌక్’ పేరుతో మఖ్దూం భవన్ వద్ద చేస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. చేతి వృత్తిదారుల సంఘ కార్యకర్తలు పాల్గొన్న దీక్షను మంగళవారం రామకృష్ణ ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ఇరువురు సీఎంలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, కుటుంబ పాలనకు అలవాటుపడి రాష్ట్రాల సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఏపీలో పనికిమాలిన ప్రభుత్వముందని, చంద్రబాబు 1.5 లక్షలSఉద్యోగాలను, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ధర్నాచౌక్‌లో ఒకప్పుడు తెలంగాణ కోసం జరిగిన నిరసనలు, సభలు, సమావేశాలలో పాల్గొన్న కేసీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం విచిత్రంగా ఉందన్నారు. సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు, చేతివృత్తిదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి కె.గోవర్దన్, బీసీ సాధన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.పాండురంగాచారి, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.