హోదా కోసం సమర శంఖం | Status Cone fighters | Sakshi
Sakshi News home page

హోదా కోసం సమర శంఖం

Published Mon, Aug 3 2015 12:03 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా కోసం  సమర శంఖం - Sakshi

హోదా కోసం సమర శంఖం

విశాఖ చేరుకున్న  సీసీఐ బస్సు యాత్ర
నేతలకు ఘన స్వాగతం
బహిరంగ సభలో {పభుత్వాల తీరుపై నిప్పులు చెరిగిన నాయకులు


విశాఖపట్నం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళంలో మొదలైన బస్సుయాత్ర ఆదివారం విశాఖకు చేరుకుంది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖను విద్య, పారిశ్రామికపరంగా అభివృద్ధి చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు సీపీఐ నేతలు ఉంచారు. విశాఖ చేరుకున్న  నేతలకు  పార్టీ నగర కార్యదర్శి డి.మార్కండేయులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలు సంఘాలు నేతలను సన్మానాలతో ముంచెత్తారు. పది రూపాయల నోట్లతో చేసిన దండలు వేశారు. ఈ సందర్భంగా జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నాయకులు ఆవేశపూరితంగా ప్రసంగించారు.

ప్రత్యేక హోదా తీసుకురాకపోతే 11వ తేదీన జగిగే బంద్‌లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. రూ.23వేల కోట్లు ప్యాకేజీ అడిగితే జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటే మన ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు.  విశాఖ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు చెబుతున్న మాటలకు, కేంద్ర మంత్రులు చెబుతున్న వాటికి పొంతన ఉండటం లేదని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌చేశారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు కేంద్రమే నిర్మించాల్సి ఉండగా సింగపూర్ దగ్గర దేవులాడటం ఎందుకని ప్రశ్నించారు.   ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ బదులు ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇవ్వాలన్నారు. చంద్రబాబు రైతు సమస్యలు పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్ధి జేఏసీ చైర్మన్ లగుడు గోవిందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంధ్రనాధ్, బెటర్ విశాఖ ఫోరం అధ్యక్షుడు సీఎస్‌రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబు, రాష్ర్ట మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరిముల్ల, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, ఏఐవైఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్.సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ మత్సకార కార్మిక సంఘం నాయకుడు వై. నందన్న, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement