విజయవాడ,(వన్‌టౌన్) : ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను అమలు చేయకుండా తెలుగు ప్రజలకు మొండిచెయ్యి చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ‘గడపగడపకూ సీపీఐ’ కార్యక్రమాన్ని స్థానిక కృష్ణవేణి షాపింగ్ కాంప్లెక్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూపీఐ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడటం బూర్జువా పార్టీలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు హోదాకు మించిన ప్యాకేజీలు ఇస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రత్యేక హోదాతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, పోల వరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు లేని విజయవాడను ఊహించజాలమన్నారు. బూర్జువా పార్టీల మాదిరిగా కోట్ల రూపాయలను వెచ్చించి కార్యక్రమాలు చేసే శక్తి కమ్యూనిస్టుపార్టీకి లేదన్నారు. అందుకే ఇంటింటికీ తిరిగి వసూలు చేసిన విరాళాలతోనే కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర సహాయ కార్యదర్శి జీ కోటేశ్వరరావు, నేతలు పల్లా సూర్యరావు,ఎల్‌దుర్గారావు, శ్రీనివాసు, యాకోబు, డీవీ రమణబాబు పాల్గొన్నారు.