
సాక్షి, అమరావతి: ఈ నెల 14న తిరుపతి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలా కంటి తుడుపుగా రూ.5 తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటే లీటర్ పెట్రోల్‌ను రూ.70–75కు, డీజిల్‌ను రూ.55–60కు అందించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని, పెరిగితేనే.. పెరుగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయిన 2014లో లీటర్ పెట్రోల్ సగటు ధర రూ.72 కాగా, ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో బేరల్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 93 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పుడు 82 డాలర్లు మాత్రమేనని.. అయినా 2021 నవంబర్ 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.116కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 11 డాలర్లు తగ్గినా పెట్రోల్ ధరను రూ.44 పెంచారని మండిపడ్డారు. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.47గా ఉన్నదాన్ని రూ.109కి పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.44 పెంచి రూ.5 తగ్గించిందని, డీజిల్‌పై రూ.61 పెంచి రూ.10 తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన ఆర్థిక నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని నిరసించాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు రామకృష్ణ పేర్కొన్నారు.