అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు
విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సబ్-కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన పికెటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దగాకోరు ప్రభుత్వంపై పోరాటం ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు ప్రధాన హామీలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు.. ఆచరణలో అమలు చేయటానికి రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు, వాటిని అమలు చేయటం సాధ్యం కాదని కొందరు చెప్పినా చంద్రబాబు బుకాయించారన్నారు. తొలిసంతకం రుణమాఫీ ఫైలుపై పెట్టి, రైతుసాధికారిత సంస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు కనీసం ఒక్కరైతుకు, లేదా డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేయలేదన్నారు. రాష్టాన్ని సింగపూర్ చేస్తానని సరికొత్త హామీలు చేశారన్నారు.
హామీల అమలు కోసం సీపీఐ పోరాటాన్ని ఉధ్రుతం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్జీ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే పోరాటాలకు వెనుకాడేది లేదన్నారు.పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రుణమాఫీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాజర్‌వలి, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, చలసాని రామారావు, దోనేపూడి శంకర్, టి.వి.రమణమూర్తి, మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గాభవాని, ఏఐటీయూసీ నాయకుడు చలసాని అజయ్‌కుమార్, ఏఐవైఎఫ్ నాయకుడు నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సబ్-కలెక్టరేట్ వద్ద జరిగిన పికెటింగ్ కార్యక్రమం సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.