పేదల కడుపుకొట్టి పెద్దలకు పరిశ్రమల పేరుతో భూములు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు పరిశ్రమలను అడ్డుకుంటున్నారంటూ శాసనమండలిలో చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని మధు తప్పుబట్టారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, పేదలు, రైతులను దెబ్బతీసి భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించే చర్యలను మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ మందుల కంపెనీకి భూములు ఇవ్వడం వల్ల రైతులు, పేదలు, హేచరీలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. దాదాపు 2094 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుందని, వాటిలో 505 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. 600 మంది రైతులను పోలీసులతో బెదిరించి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుందని, ఇంకా 220మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తీరు వల్ల ఆ ప్రాంతంలో రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసుకున్న సుమారు 250 రొయ్య పిల్లల (సీడ్ ఉత్పత్తి) హేచరీలు మూతపడి 10 వేల మంది ఉపాధిని కోల్పోతారన్నారు. అక్కడ జీడిమామిడి తోటల సాగు జరుగుతోందని, ఎకరానికి ఏడాదికి కనీసం రూ.1.20 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఆ భూమిని లాగేసుకుని రూ.1.80 లక్షల నుంచి రూ.3 లక్షల వరకే ధర నిర్ణయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దివీస్ ప్యాక్టరీ ఏర్పాటుతో సముద్ర జలాలు కలుషితమై చేపలు చనిపోయి మత్స్యకారులు జీవన భతి దెబ్బతింటుందని, గాలి నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యంబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలోను ప్రభుత్వం మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు అనుమతించి ప్రజలు, మత్స్యకారులు, రైతుల జీవనాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. రోజుకు 150 టన్నుల రొయ్యలు ప్రోసెసింగ్ జరిగే ఆక్వా ఫుడ్‌పార్క్ ఏర్పాటుతో వచ్చే వ్యర్థాలవల్ల గొంతేరు డ్రై న్ కాలుష్యం బారిన పడుతుందన్నారు. దీనివల్ల 4 మండలాల్లోని 40గ్రామాలకు కలుషిత నీరు దిక్కవుతుందన్నారు. చిరంజీవి స్వగ్రామం ఉన్న మొగల్తూరు కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకుందని గుర్తు చేశారు. దీన్ని ఆపాలని ప్రజలు అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మంకుపట్టు వదలకుండా పోలీసులను దించి భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. దివీస్ మందుల ఫ్యాక్టరీని కాకినాడ సెజ్ ప్రాంతంలోను, తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్ తీర ప్రాంతంలోను ఏర్పాటుచేసుకోవాలని మధు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు(వైవీ) కూడా పాల్గొన్నారు.