చంద్రబాబు పచ్చి మోసగాడు: మధు
తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసగాడని, ఓటుకు నోటు వ్యవహారంలో అతడిపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తుళ్లూరులో సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, భూమి లేని, కౌలురైతులకు నెలవారీ పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
రాజధాని ప్రాంతంలో భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయకూలీలు, కౌలురైతులు, డ్వాక్రా మహిళలు, వృత్తిదారులను చంద్రబాబు నమ్మించి మోసగించారని దుయ్యబట్టారు. నెలవారీ పింఛన్, కౌలు పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకని నిలదీశారు. వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిన్నింగ్ మిల్లుకు సంబంధించి కోట్ల రుపాయల బకాయిలను రద్దు చేశారని ఆరోపించారు. పేదలకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని, ఇది దగాకోరు ప్రభుత్వమని అభివర్ణించారు.
రాజధాని ప్రజల సమస్యలపై ఈ నెల 9న అన్ని వామపక్షాలు విజయవాడలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అనంతరం లక్షమంది మహిళలతో మహోద్యమం చేపడతామని, చంద్రబాబు సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయకమిటీ కన్వీనర్ సిహెచ్.బాబురావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం చేయకపోతే చంద్రబాబు సహా మంత్రులను గ్రామాల్లో తిరగనీయబోమని చెప్పారు.
వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవి, సీపీఎం మంగళగిరి డివిజన్ కార్యదర్శి జె.వి.రాఘవులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సీపీఎం నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, జె.నవీన్‌ప్రకాష్, ఈమని అప్పారావు, జయప్రకాష్ పాల్గొన్నారు.