ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ ధోరణి అవలంబిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని పిలుపునివ్వడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు.
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ ధోరణి అవలంబిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని పిలుపునివ్వడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. నెల్లూరు నగరంలో మంగళవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార ఆర్భాటాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, ప్రజా సంఘాలను చీల్చడం తప్ప... ప్రజలకు చేసిందేమీ లేదని... చంద్రబాబుపై మధు నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం ఇతర దేశాలు పట్టుకుని తిరుగుతూ ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తూ ఒక పక్క రైతులు ఆత్మహత్యలు, మరో పక్క బతకలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకుండా ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేయడంతోనే అధికార టీడీపీ కాలం వెళ్ల తీసిందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు.