రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకతాటిపై కదులుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. విభజన హామీల అమలు కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి మధు ప్రారంభించారు.
మధు మాట్లాడుతూ చంద్రబాబుకు దిమాగ్ ఖరాబైందని, అందుకే పొంతనలేని మాటలతో అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల ఆందోళనలు అవసరం లేదని, అఖిలపక్షం అక్కర్లేదని చెబుతున్న బాబు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలు, ఆందోళనలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. బంద్ విజయవంతం కారణంగానే ప్రధాని మోదీ నుంచి బాబుకు పిలుపు వచ్చిందనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బంద్ విజయవంతం చేసిన ప్రతిపక్షాలు, ప్రజలను చంద్రబాబు అభినందించాలన్నారు.