ప్రపంచబ్యాంకుకు ఏపీ తాకట్టు
- సీఎం చంద్రబాబు విధానాలపై సీపీఎం మండిపాటు
హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు సీఇవోనని గతంలోనే ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు కార్పొరేట్ సంస్థల ఏజెంటుగా మారారని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి మరోసారి 'బ్యాంకు' పాలనకు తెరలేపారని సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ మండిపడింది. 'వివిధ రాష్ట్రాల వ్యాపార సంబంధ సంస్కరణల మదింపు' పేరిట ఈనెల 14న ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో- వ్యాపారానికి ఏపీ రెండో అనువైన రాష్ట్రమంటూ కితాబివ్వడమే అందుకు సాక్ష్యమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ నివేదికను తయారు చేసిన మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ బ్యాంకు, కేపీఎంజీ, సీఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలన్నీ ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో నడిచేవని, అవసరానికి మించి భూమిని సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వ్యాపారావకాశాలకు పెద్ద పీట వేయాలని ప్రపంచ బ్యాంకు ఆదేశిస్తే చంద్రబాబు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర రాజధాని మొదలు బోగాపురం, భావనపాడు, మచిలీపట్నం పోర్టు వరకు ప్రతి దానికీ అవసరానికి మించే భూమి సేకరిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రైతుల్ని సమీకరించి చంద్రబాబు నాయుడు ఆట కట్టించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతున్న 7,64,280 ఎకరాలు కాక మరో 8 లక్షల ఎకరాల్ని సేకరించి కార్పొరేట్లకు అప్పగించేందుకే బాబు భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలోని 36 సెజ్‌లలో 9 లక్షల ఎకరాల భూమి ఉందని, దాన్ని ఉపయోగించుకోవడానికి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారని మండిపడ్డారు.