రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయటంలో దొర్లిన పొరపాట్లు, పార్టీల ఎత్తుగడలతో తీవ్రంగా నష్టపోయినట్లు సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిర్వేదం వ్యక్తమైంది.
సీపీఎం నాయకత్వంపై జిల్లా పార్టీల నేతల ధ్వజం
విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయటంలో దొర్లిన పొరపాట్లు, పార్టీల ఎత్తుగడలతో తీవ్రంగా నష్టపోయినట్లు సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిర్వేదం వ్యక్తమైంది. విజయవాడ సిద్దార్ధ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ ఆంధ్రప్రదేశ్ తొలి మహాసభల్లో దాదాపు అన్ని జిల్లాల నేతలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
’రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయిపోతున్నాం. అదును తప్పి అంచనాలు వేస్తున్నాం. మనం ఎన్ని చెప్పినా పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు ఎన్నికలనే కొలమానంగా ప్రజలు భావిస్తున్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన సమయంలో తప్పిదాలు చేస్తున్నాం. అవసరం లేనప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నాం. ఇంకెంత కాలం ఇలా?’ అని వివిధ జిల్లాల ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రవేశపెట్టిన రాజకీయ, నిర్మాణ నివేదికపై జరిగిన చర్చలో వారంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ అర్బన్ సహా జిల్లాల నేతలంతా 2014 ఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించినట్టు తెలిసింది.
ఇలా అయితే ఎలా ఆదరిస్తారు?
‘2014 ఎన్నికల్లో అనుసరించిన ఎత్తుగడలు పార్టీకి తోడ్పడకపోగా తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని జేఎస్పీతో ఎన్నికల అవగాహనతో నిష్ర్పయోజనమే మిగిలింది. పార్టీ వ్యవహార శైలి శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించింది. సాంప్రదాయంగా వచ్చే ఓట్లు కూడా రాలేదు. కులం, మతం, డబ్బు తదితర అంశాల ప్రభావం చివరకు పార్టీ ఓటర్ల మీద కూడా పడింది. చివరకు పార్టీ పునాదులే కదిలిపోయాయి’ అని మహాసభల్లో నేతలు పేర్కొన్నట్లు తెలిసింది.
ఔను తప్పు జరిగింది: మధు
ఎన్నికలు- ఎత్తుగడల పంథాపై వచ్చిన విమర్శలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు జవాబిస్తూ ఇందులో లోపం జరిగినట్టు అంగీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వామపక్షాల ఐక్యతకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ప్రయత్నించాల్సి వచ్చిందని, ఇది సమష్టి నిర్ణయమేనని వివరించారు. పార్టీకి నష్టం జరిగిందని అంగీకరించిన ఆయన ఇక ముందు అలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పార్టీకి పూర్వ వైభవం తెద్దామన్నారు.
రైతుల పక్షాన పోరాడతాం: ఏచూరి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దతలేదని ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంటులో ప్రతిఘటిస్తామని అన్నారు. రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి రైతులు డి.బాలాజీరెడ్డి, అంకమరెడ్డి, ఆదియ్య, వీరస్వామి, రామిరెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో సీపీఎం మహాసభల్లో పాల్గొన్న ఏచూరిని సోమవారం రాత్రి కలిశారు.
చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు తమను భయాందోళనలకు గురిచేస్తోందని తెలిపారు. ఏచూరి స్పందిస్తూ.. పార్లమెంటు లో సుదీర్ఘ చర్చ తరువాత భూ సేకరణ చట్టం వచ్చిందని, దాన్ని అమలు చేయకుండా.. రైతులు, కూలీలకు కీడు చేసేలా ల్యాండ్ పూలింగ్‌ను అమలు చేయడం సరికాదన్నారు. భూ సేకరణ చ ట్టానికి సవరణలతో ఆర్డినెన్సు తెచ్చి మోదీ ప్రభుత్వం బాబుకు మేలు చేసిందని విమర్శించారు.