అభిప్రాయం
‘‘అల్లా మెహర్భాన్ రహేతో గధాబి పైల్‌మాన్ బనేగా’’ (దేవుడి దయ ఉంటే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు) ఇప్పుడు టీడీపీ అండ, దాన్ని బలపర్చే మీడియా దన్నుతో సీయం రమేష్ నాయుడు రాజకీయ నేతగా ఎదగజూస్తున్నారు. ఒకప్పుడు సారా వ్యాపారంతో డబ్బులు ఆర్జించి ఆపైన సివిల్ కాంట్రాక్టరుగా పెరిగి పెద్దవాడై నేడు రుత్విక్ అనే బడా కాంట్రాక్టు కంపెనీ యజమానిగా ఎదిగిపోయారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి దాన్ని చంద్రబాబు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సచి వాలయంలో, సీఎం పేషీలో రమేష్ నాయుడి హవా అంతాఇంతా కాదు. సెక్యూరిటీ పాసు లేకపోయినా, ముందస్తు అనుమతి లేకపోయినా సిఎం పేషీలోకి ప్రవేశించగల సన్నిహిత సంబంధం రమేష్‌ది.
కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్ళలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటిదశ ఉత్పత్తిని జాతికి అంకితం చేయడానికి, రెండో దశ నిర్మాణం శంకుస్థాపన చేయడానికి కల్లమల్ల వద్ద గల ఆర్‌టీపీపీకి వైఎస్సార్ వచ్చినప్పుడు జరిగిన మేళా కార్యక్రమాన్ని సీయం రమేష్‌నాయుడు తన స్వంత ఖర్చులతో అంతా తానై నిర్వహించాడు. ఎంత విచిత్రం. అది వరకు బాబుకు అత్యంత దోíస్తీగా ఉండిన రమేష్ అధికార పదవి అటు నుండి ఇటు మారగానే తన ఆర్థిక అవసరార్ధం వైఎస్సార్‌తో కలసిపోయారు. థర్మల్ కేంద్రంలో, నీటిపారుదల ప్రాజెక్టులలో కాంట్రాక్టు పదవులూ పొందారు.
ఆ అంకం ముగిసి బాబు జమానా మొదలవగానే కోట్లు ఇచ్చి రాజ్యసభ స్థానాన్ని పొందగలిగారు. కానీ కడప జిల్లా ప్రజలు, సీయం రమేష్‌ను వ్యాపారవేత్త, కాంట్రాక్టరుగానే చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా చూడ్డం లేదు. ఇందుకు కలత చెందారేమో కానీ అమాంతంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికై నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు.
2007 జూలై 10న బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగు వద్ద శంకుస్థాపన రోజు వైఎస్సార్ సరసన నిలబడి నాడు చిలకపలుకులు పలికిన నాయకులంతా ప్రత్యర్ధి పార్టీలో చేరి పోయి నేడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. 2009లో వైఎస్సార్ ప్రమాదవశాత్తు చని పోయారు. తదనంతర పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలోనే కడపజిల్లాలో మొట్ట మొదట ‘‘కడప ఉక్కు రాయలసీమ హక్కు’’ నినాదం పేరుతో 2011లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించి సదస్సు నిర్వహించడమైంది. ఇదిసీమ అంతటా అభ్యుదయ, ప్రగతి శీల శక్తులకు గొప్ప ప్రేరణ ఇచ్చింది.
2011 నుండి 2018 మే వరకూ ఈ ఉద్యమంలో సీఎం రమేష్ నాయుడు, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారో? బాబును ఏ గ్రహæణం ఆవరించిందో? అధికారమత్తులో ప్రజల కోర్కెలను మరచిపోయి ఇపుడు ఎన్నికలు దగ్గరపడేటప్పటికీ పొంతన లేని ప్రకటనలతో, శాపనార్ధా్దలతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారట.
టీడీపీ వారంతా 2018 మార్చి వరకూ అంటే బీజేపీతో అంటకాగినంత వరకూ కడప స్టీల్ ఫ్యాక్టరీ చెల్లుబాటు కాదని, ఫిజుబిలిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇపుడు అంతా కట్టగట్టుకొని కడపలో వాలిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిన్న నిప్పురవ్వలా నాడు ఎగిసిన ఉద్యమం నేడు అగ్నిపర్వతంలా తయారైంది. ఇక బ్రద్దలై లావా పొంగి పారుతుందని సీఎం రమేష్ బహిరంగ లేఖ రాశారు. నిజమే.. ప్రజల్లో టీడీపీ, బీజేపీ పట్ల ఉన్న అసంతృప్తి నిరసనల రూపంలో నిన్నటి వరకూ వ్యక్తమవుతూ వచ్చింది. ఇక తీవ్రమైన వ్యతిరేకత రూపంలో పెల్లుబికి ఆ రెండు పార్టీలను 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. రమేష్ నాయుడి ఆశలు, బాబు అండ్ కో ఆశలు అడియాసలు కాకమానవు. ‘చిత్తశుద్ధిలేని శివపూజలేల’ అని వేమన చెప్పిన మాటలు టీడీపీ నాయకులు ఇకనైనా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది.
జి. ఓబులేసు
వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment