ఎమ్మెల్యే రాచమల్లుకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే అంజద్‌బాషా, సురేష్‌బాబు, వెంకటసుబ్బయ్య
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : ఆరేళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ ఏనాడు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాట్లాడలేదని, నేడు ఆమరణ దీక్ష అంటూ డ్రామా ఆడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పుట్టపర్తి సర్కిల్‌లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య పరిష్కరమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తలచారన్నారు. ఆయన బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించారన్నారు. దీనికి రూ.1700 కోట్లు ఖర్చుపెట్టారన్నారు.
అయితే చంద్రబాబు కోర్టులో కేసు వేయడంతో పరిశ్రమ ఆగిపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని పార్టీలను కలుపుకొని జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమాలను చేసిం దని తెలిపారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెయిల్ ప్రభుత్వ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల్లో అన్ని అంశాలపై పోరాడింది వైఎస్ జగన్ ఒక్కరే అని తెలిపారు. ఆరేళ్లుగా రాజ్యసభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పార్లమెంట్‌లో ఈ ప్రాంతం గురించి, ఉక్కు పరిశ్రమ స్థాపనపై గళం విప్పలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ పార్టీ పోరాడుతోందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 29న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు.
నాలుగేళ్లుగా మాయమాటలు చెప్పారు
నాలుగేళ్లుగా చంద్రబాబు మాయమాటలు చెప్పి కేంద్రంతో సంసారం చేశారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు వస్తుండటం, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పార్లమెంట్‌లో సీఎంరమేష్ ఏ రోజన్నా జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలని ప్రశ్నించారా? అని అన్నారు. ఎప్పుడు కాంట్రాక్టర్లు చేసుకుని డబ్బు ఎలా దోచుకుందుకే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నా రు. తమ ఎంపీలు మొదటి నుంచి ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడుతునే ఉన్నారన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు నాటకమాడుతూ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే రాష్ట్ర విభజనకు కారణమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన స్టీల్ ప్లాంట్‌ను ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఖనిజం మన వద్ద ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment