CPI Andhra Pradesh State Committee
-
చంద్రబాబును ఓడించండి: సీపీఐ
మైదుకూరు(వైఎస్సార్ కడప) : ‘టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 640 మండలాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదు.. ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది..వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ జిల్లా జిల్లా మహాసభల్లో భాగంగా సోమవారం రెండో రోజు మైదుకూరులోని ఏ–1 కల్యాణ మండపంలో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా అమరావతి, పోలవరం గురించే ఆలోచిస్తూ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, చీప్ లిక్కర్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్నారు. కర్నూలులో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ ఫ్యాక్టరీలో 12 మంది దుర్మరణం చెందారన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, టీడీపీ నాయకులందరూ లంచాలకు పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.94వేల కోట్ల రాష్ట్ర అప్పును చంద్రబాబునాయుడు రూ.2.49 లక్షల కోట్లు చేశారని, ఈయనకు అప్పులు చేయటమే తెలుసని, ప్రజలకు మేలు చేయటం తెలియదన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని, దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. టీవీలు, పేపర్లలో గొప్ప ప్రకటనలు తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 90శాతం కార్పొరేట్ మీడియాను చేతిలో పెట్టుకుని అధిక ప్రచారం చేయించుకుని, ప్రజలను మభ్యపెట్టి గెలిచారన్నారు. నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి యువతకు పంగనామం పెట్టారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంతో 2.64 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, కోట్లాది ఉద్యోగులు వీధినపడ్డారన్నారు. వేల కోట్లు రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ, లలిత్‌మోదీలు విదేశాల్లో జీవిస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు, జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవులు వెంకటరమణ, పులి కృష్ణమూర్తి, ఎంవీ సుబ్బారెడ్డి, నాగసుబ్బారెడ్డి, చంద్ర, శేఖర్, వెంకటేష్, శివ, స్థానిక నాయకులు పి.శ్రీరాములు, షావల్లి, పుల్లయ్య, బీఓ రమణ, మహిళా నాయకురాలు మున్నీ, బండి అరుణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రమేషూ దీక్షా పురుషుడేనా?
అభిప్రాయం ‘‘అల్లా మెహర్భాన్ రహేతో గధాబి పైల్మాన్ బనేగా’’ (దేవుడి దయ ఉంటే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు) ఇప్పుడు టీడీపీ అండ, దాన్ని బలపర్చే మీడియా దన్నుతో సీయం రమేష్ నాయుడు రాజకీయ నేతగా ఎదగజూస్తున్నారు. ఒకప్పుడు సారా వ్యాపారంతో డబ్బులు ఆర్జించి ఆపైన సివిల్ కాంట్రాక్టరుగా పెరిగి పెద్దవాడై నేడు రుత్విక్ అనే బడా కాంట్రాక్టు కంపెనీ యజమానిగా ఎదిగిపోయారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి దాన్ని చంద్రబాబు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సచి వాలయంలో, సీఎం పేషీలో రమేష్ నాయుడి హవా అంతాఇంతా కాదు. సెక్యూరిటీ పాసు లేకపోయినా, ముందస్తు అనుమతి లేకపోయినా సిఎం పేషీలోకి ప్రవేశించగల సన్నిహిత సంబంధం రమేష్‌ది. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్ళలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటిదశ ఉత్పత్తిని జాతికి అంకితం చేయడానికి, రెండో దశ నిర్మాణం శంకుస్థాపన చేయడానికి కల్లమల్ల వద్ద గల ఆర్టీపీపీకి వైఎస్సార్ వచ్చినప్పుడు జరిగిన మేళా కార్యక్రమాన్ని సీయం రమేష్‌నాయుడు తన స్వంత ఖర్చులతో అంతా తానై నిర్వహించాడు. ఎంత విచిత్రం. అది వరకు బాబుకు అత్యంత దోíస్తీగా ఉండిన రమేష్ అధికార పదవి అటు నుండి ఇటు మారగానే తన ఆర్థిక అవసరార్ధం వైఎస్సార్‌తో కలసిపోయారు. థర్మల్ కేంద్రంలో, నీటిపారుదల ప్రాజెక్టులలో కాంట్రాక్టు పదవులూ పొందారు. ఆ అంకం ముగిసి బాబు జమానా మొదలవగానే కోట్లు ఇచ్చి రాజ్యసభ స్థానాన్ని పొందగలిగారు. కానీ కడప జిల్లా ప్రజలు, సీయం రమేష్‌ను వ్యాపారవేత్త, కాంట్రాక్టరుగానే చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా చూడ్డం లేదు. ఇందుకు కలత చెందారేమో కానీ అమాంతంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికై నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. 2007 జూలై 10న బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగు వద్ద శంకుస్థాపన రోజు వైఎస్సార్ సరసన నిలబడి నాడు చిలకపలుకులు పలికిన నాయకులంతా ప్రత్యర్ధి పార్టీలో చేరి పోయి నేడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. 2009లో వైఎస్సార్ ప్రమాదవశాత్తు చని పోయారు. తదనంతర పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలోనే కడపజిల్లాలో మొట్ట మొదట ‘‘కడప ఉక్కు రాయలసీమ హక్కు’’ నినాదం పేరుతో 2011లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించి సదస్సు నిర్వహించడమైంది. ఇదిసీమ అంతటా అభ్యుదయ, ప్రగతి శీల శక్తులకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. 2011 నుండి 2018 మే వరకూ ఈ ఉద్యమంలో సీఎం రమేష్ నాయుడు, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారో? బాబును ఏ గ్రహæణం ఆవరించిందో? అధికారమత్తులో ప్రజల కోర్కెలను మరచిపోయి ఇపుడు ఎన్నికలు దగ్గరపడేటప్పటికీ పొంతన లేని ప్రకటనలతో, శాపనార్ధా్దలతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారట. టీడీపీ వారంతా 2018 మార్చి వరకూ అంటే బీజేపీతో అంటకాగినంత వరకూ కడప స్టీల్ ఫ్యాక్టరీ చెల్లుబాటు కాదని, ఫిజుబిలిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇపుడు అంతా కట్టగట్టుకొని కడపలో వాలిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిన్న నిప్పురవ్వలా నాడు ఎగిసిన ఉద్యమం నేడు అగ్నిపర్వతంలా తయారైంది. ఇక బ్రద్దలై లావా పొంగి పారుతుందని సీఎం రమేష్ బహిరంగ లేఖ రాశారు. నిజమే.. ప్రజల్లో టీడీపీ, బీజేపీ పట్ల ఉన్న అసంతృప్తి నిరసనల రూపంలో నిన్నటి వరకూ వ్యక్తమవుతూ వచ్చింది. ఇక తీవ్రమైన వ్యతిరేకత రూపంలో పెల్లుబికి ఆ రెండు పార్టీలను 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. రమేష్ నాయుడి ఆశలు, బాబు అండ్ కో ఆశలు అడియాసలు కాకమానవు. ‘చిత్తశుద్ధిలేని శివపూజలేల’ అని వేమన చెప్పిన మాటలు టీడీపీ నాయకులు ఇకనైనా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది. జి. ఓబులేసు వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
జేసీ దివాకర్‌రెడ్డికి అసెంబ్లీలో ఏం పని ?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం అనంతపురంలో మండిపడ్డారు. కాల్‌మనీ కేసులో ఆరోపణలున్న టీడీపీ నేతలను విచారించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో ప్రతిపక్షం లేకుండానే బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో ఇద్దరిదీ తప్పేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం తప్పని అన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అలాగే అనంతపురం లోక్‌సభ సభ్యుడు, టీడీపీ నాయకుడు జేసీ దివాకరరెడ్డిపై కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం పని అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని రామకృష్ణ ఈ సందర్బంగా ప్రశ్నించారు. -
'అది తప్ప మరో మాట రాదా'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోటి వెంట రాజధాని మాట తప్ప మరొకటి రావడం లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా వారి గోడు పట్టించుకోవట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేస్తానన్న బాబు.. కేవలం విదేశీ పర్యటనలకు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన.. పట్టిసీమ ప్రాజెక్టు గురించి వాస్తవాలను మాట్లాడే వారిని రాయలసీమ వ్యతిరేకులుగా పేర్కొనడంపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి పెరిగిందని, ప్రాజెక్టులపై చర్చిందేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. -
'డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో సీపీఐ నాయకులు, కార్యకర్తులు ఆందోళనకు దిగారు. దీంతో రామకృష్ణతోపాటు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... అఖిలపక్షాన్ని స్వయంగా ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రుల ఇళ్ల ఎదుట కూడా నిరసనలు తెలుపుతామని రామకృష్ణ పేర్కొన్నారు. -
'బాబు గతంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నారు'
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకే చోట జరిగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల మధ్య మళ్లీ వైషమ్యాలు పెరుగుతాయని రామకృష్ణ విమర్శించారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రామకృష్ణ... చంద్రబాబుకు సూచించారు. అలాగే డబ్బులు లేవంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయిలు దుబారా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ఈ సందర్బంగా రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
కేంద్రంతో పోరాడలేక పన్ను పోటా?
సీఎం చంద్రబాబుపై సీపీఎం మండిపాటు విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేక రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని సీపీఎం మండిపడింది. విభజన సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, ఆర్ధిక లోటు భర్తీ హామీ తదితర వ్యవహారాలలో దాగుడు మూతలెందుకని సూటిగా ప్రశ్నించింది. కేంద్రంలోని పెద్దలతో లాలూచీ పడకుండా అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడాలని టీడీపీ సర్కారుకు హితవు పలికింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సీపీఎం తొలి మహాసభల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు తీర్మానాలను ఆమోదించారు. అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలు చేయని కేంద్రం ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబును నిలదీశారు. మహాసభల్లో ఆమోదించిన 36 తీర్మానాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మీడియా విడుదల చేస్తూ చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ అనుభవాల దృష్ట్యా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేసి మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలకు తావివ్వొద్దని సూచించారు. సింగపూర్ నుంచి క్లబ్బులు, డాన్సులు, చెత్తాచెదారాలను రాష్ట్రానికి దిగుమతి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎత్తుగడల్లో చిత్తయ్యాం!
సీపీఎం నాయకత్వంపై జిల్లా పార్టీల నేతల ధ్వజం విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయటంలో దొర్లిన పొరపాట్లు, పార్టీల ఎత్తుగడలతో తీవ్రంగా నష్టపోయినట్లు సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిర్వేదం వ్యక్తమైంది. విజయవాడ సిద్దార్ధ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ ఆంధ్రప్రదేశ్ తొలి మహాసభల్లో దాదాపు అన్ని జిల్లాల నేతలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ’రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయిపోతున్నాం. అదును తప్పి అంచనాలు వేస్తున్నాం. మనం ఎన్ని చెప్పినా పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు ఎన్నికలనే కొలమానంగా ప్రజలు భావిస్తున్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన సమయంలో తప్పిదాలు చేస్తున్నాం. అవసరం లేనప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నాం. ఇంకెంత కాలం ఇలా?’ అని వివిధ జిల్లాల ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రవేశపెట్టిన రాజకీయ, నిర్మాణ నివేదికపై జరిగిన చర్చలో వారంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ అర్బన్ సహా జిల్లాల నేతలంతా 2014 ఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించినట్టు తెలిసింది. ఇలా అయితే ఎలా ఆదరిస్తారు? ‘2014 ఎన్నికల్లో అనుసరించిన ఎత్తుగడలు పార్టీకి తోడ్పడకపోగా తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని జేఎస్పీతో ఎన్నికల అవగాహనతో నిష్ర్పయోజనమే మిగిలింది. పార్టీ వ్యవహార శైలి శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించింది. సాంప్రదాయంగా వచ్చే ఓట్లు కూడా రాలేదు. కులం, మతం, డబ్బు తదితర అంశాల ప్రభావం చివరకు పార్టీ ఓటర్ల మీద కూడా పడింది. చివరకు పార్టీ పునాదులే కదిలిపోయాయి’ అని మహాసభల్లో నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. ఔను తప్పు జరిగింది: మధు ఎన్నికలు- ఎత్తుగడల పంథాపై వచ్చిన విమర్శలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు జవాబిస్తూ ఇందులో లోపం జరిగినట్టు అంగీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వామపక్షాల ఐక్యతకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ప్రయత్నించాల్సి వచ్చిందని, ఇది సమష్టి నిర్ణయమేనని వివరించారు. పార్టీకి నష్టం జరిగిందని అంగీకరించిన ఆయన ఇక ముందు అలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పార్టీకి పూర్వ వైభవం తెద్దామన్నారు. రైతుల పక్షాన పోరాడతాం: ఏచూరి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దతలేదని ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంటులో ప్రతిఘటిస్తామని అన్నారు. రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి రైతులు డి.బాలాజీరెడ్డి, అంకమరెడ్డి, ఆదియ్య, వీరస్వామి, రామిరెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో సీపీఎం మహాసభల్లో పాల్గొన్న ఏచూరిని సోమవారం రాత్రి కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు తమను భయాందోళనలకు గురిచేస్తోందని తెలిపారు. ఏచూరి స్పందిస్తూ.. పార్లమెంటు లో సుదీర్ఘ చర్చ తరువాత భూ సేకరణ చట్టం వచ్చిందని, దాన్ని అమలు చేయకుండా.. రైతులు, కూలీలకు కీడు చేసేలా ల్యాండ్ పూలింగ్ను అమలు చేయడం సరికాదన్నారు. భూ సేకరణ చ ట్టానికి సవరణలతో ఆర్డినెన్సు తెచ్చి మోదీ ప్రభుత్వం బాబుకు మేలు చేసిందని విమర్శించారు. -
మోడీని భుజానికెత్తుకోవడం సిగ్గుచేటు!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని గోద్రా మారణకాండకు కారణమైన నరేంద్రమోడీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేన్నోళ్ల కీర్తిస్తూ పులకించిపోతున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో జరిగిన సభల్లో చంద్రబాబు తీరు రాజును మించిన రాజభక్తిగా ఉందని మండిపడింది. కార్పొరేట్ శక్తుల ప్రతినిధి అయిన మోడీ ని చంద్రబాబు ప్రశంసిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా, ఎన్నికలను కాసుల జాతరగా మారుస్తున్న బూర్జువాపార్టీలు అధికారం కోసం గంగవైలెత్తుతున్నాయని, కోట్లకు కోట్లు వ్యయం చేస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. గుజారాత్ అభివృద్ధి నమూనా అంటూ ఊదరగొడుతున్న నరేంద్రమోడీ ఓ కార్పొరేట్ సంస్థకు 45వేల ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. మోడీ కరుడుగట్టిన మతోన్మాది, తిరోగమన ప్రతినిధి అని రామకృష్ణ పేర్కొన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 14వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉందని, దాన్ని ఎలా భర్తీ చేయాలో చెప్పకుండా లేనిపోని హామీలు గుప్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులను గెలిపించి పేద ప్రజల వాణి నూతన శాసనసభలో వినిపించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును, బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించాల్సిందిగా పిలుపిచ్చారు.