సీఎం చంద్రబాబుపై సీపీఎం మండిపాటు
విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేక రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని సీపీఎం మండిపడింది. విభజన సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, ఆర్ధిక లోటు భర్తీ హామీ తదితర వ్యవహారాలలో దాగుడు మూతలెందుకని సూటిగా ప్రశ్నించింది. కేంద్రంలోని పెద్దలతో లాలూచీ పడకుండా అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడాలని టీడీపీ సర్కారుకు హితవు పలికింది.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సీపీఎం తొలి మహాసభల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు తీర్మానాలను ఆమోదించారు. అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలు చేయని కేంద్రం ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబును నిలదీశారు.
మహాసభల్లో ఆమోదించిన 36 తీర్మానాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మీడియా విడుదల చేస్తూ చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ అనుభవాల దృష్ట్యా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేసి మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలకు తావివ్వొద్దని సూచించారు. సింగపూర్ నుంచి క్లబ్బులు, డాన్సులు, చెత్తాచెదారాలను రాష్ట్రానికి దిగుమతి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంతో పోరాడలేక పన్ను పోటా?
Published Tue, Feb 10 2015 3:06 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement