సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని గోద్రా మారణకాండకు కారణమైన నరేంద్రమోడీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేన్నోళ్ల కీర్తిస్తూ పులకించిపోతున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో జరిగిన సభల్లో చంద్రబాబు తీరు రాజును మించిన రాజభక్తిగా ఉందని మండిపడింది. కార్పొరేట్ శక్తుల ప్రతినిధి అయిన మోడీ ని చంద్రబాబు ప్రశంసిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా, ఎన్నికలను కాసుల జాతరగా మారుస్తున్న బూర్జువాపార్టీలు అధికారం కోసం గంగవైలెత్తుతున్నాయని, కోట్లకు కోట్లు వ్యయం చేస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. గుజారాత్ అభివృద్ధి నమూనా అంటూ ఊదరగొడుతున్న నరేంద్రమోడీ ఓ కార్పొరేట్ సంస్థకు 45వేల ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. మోడీ కరుడుగట్టిన మతోన్మాది, తిరోగమన ప్రతినిధి అని రామకృష్ణ పేర్కొన్నారు.
కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 14వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉందని, దాన్ని ఎలా భర్తీ చేయాలో చెప్పకుండా లేనిపోని హామీలు గుప్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులను గెలిపించి పేద ప్రజల వాణి నూతన శాసనసభలో వినిపించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును, బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించాల్సిందిగా పిలుపిచ్చారు.
మోడీని భుజానికెత్తుకోవడం సిగ్గుచేటు!
Published Thu, May 1 2014 9:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement