godra riots
-
బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ.. బ్రిటీష్ అరాచకాలపై కేరళ గవర్నర్ ఫైర్
Kerala Governor Arif Mohammad.. దేశంలో ప్రధాని మోదీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డ్యాకుమెంటరీపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. కాగా, ఈ బీబీసీ డాక్యుమెంటరీపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీబీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేరళ గవర్నర్ ఖాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన వారు భారతదేశంలో బ్రిటీష్ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదని ప్రశ్నించారు. వందల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్నో రంగాల్లో ముందంజలో ఉంది. ఆర్థికంగా బలోపేతమై ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కొందరు నిరాశకు గురవుతున్నారు. అందుకే ఇలా డాక్యుమెంటరీ పేరుతో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం ఇది. ఇప్పుడు భారత్ పేరును చెడగొట్టడానికే దీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడే డాక్యుమెంటరీని బయటకు తీసుకురావడాని కారణమేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ ఎదుగుదలను చూడలేకనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే, న్యాయవ్యవస్థ తీర్పులపై డాక్యుమెంటరీని విశ్వసిస్తున్న కొందరిని చూస్తే జాలివేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. 2002 గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అల్లర్ల సమయంలో కొన్ని అంశాలను పరిశోధించినట్లు పేర్కొంటున్న రెండు భాగాల డాక్యుమెంటరీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్యుమెంటరీపై బీబీసీ వివరణ కూడా ఇచ్చింది. ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించిన తర్వాతనే దీన్ని రూపొందించినట్టుగా తెలిపింది. దీనికోసం అప్పటి సాక్ష్యులు, నిపుణులను సంప్రదించామని.. బీజేపీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని పేర్కొంది. -
11 మంది జీవిత ఖైదీలు విడుదల... షాక్‌లో బాధితులు
సాక్షి అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక కుటుంబంపై దాడి చేసి ఏడుగురుని హతమార్చి, ఒక మహిళపై సాముహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన బాధిత కుటుంబం ఆశ్చర్యపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం బిల్కిస్ బానో, ఆమె భర్త రసూల్ ఈ విషయమై మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఈ ఘోర సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు అయ్యిందని తాను తన భార్య, ఐదుగురు కుమారులకు ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పాడు. గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ ప్రకారం 11 మంది జీవిత ఖైదీలు విడుదల చేసేందుకు అనుమతివ్వడంతో వారు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేన్ని పరిగణలోని తీసుకుని వారిని విడుదల చేసిందనేది తమకు తెలియదని రసూల్ చెబుతున్నాడు. ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని ఆవేదనగా చెప్పాడు రసూల్. అసలేం జరిగిందంటే మార్చి 3, 2002న గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో దాహుద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకాలోని రంధిక్పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుంటుంబంపై ఒక గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ కుటుంబంలోని ఏడుగురిని పొట్టనబెట్టుకుంది ఆ దుండగుల గుంపు. దీంతో ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు జనవరి 21, 2008న ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఐతే నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు మే 3, 2017న సీబీఐ కోర్టు శిక్షను సమర్థించింది. అలాగే ఇదే కేసుకి సంబంధించి ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లకు కూడా బాంబే హైకోర్టు శిక్ష విధించింది. అంతేకాదు 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బిల్కిస్ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ భర్త రసూల్ సుప్రీం కోర్టు రూ. 50 లక్షలు పరిహారం ఇచ్చిందని వాటితోనే కొడుకుని చదివించుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఉద్యోగం ఇల్లు ఇప్పించలేదని రసూల్ చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ నిందితులు మాట్లాడుతూ...తాము దోషులుగా నిర్థారింపబడి సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాము. విడుదల చేయమని సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వ మమ్మలని విడుదల చేసింది. ప్రస్తుతం మేము మా కుటుంబాలను కలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆనందంగా చెబుతున్నారు. (చదవండి: బస్సుని ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... 20 మంది సజీవ దహనం) -
గోద్రా అల్లర్లు : మోదీకి క్లీన్ చిట్
సాక్షి, న్యూఢిల్లీ : 2002 గోద్రా అనంతర అల్లర్ల వెనుక నరేంద్ర మోదీ సారథ్యంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ క్లీన్చిట్ ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వానికి అందిన ఈ నివేదికను రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్ సింగ్ జడేజా అసెంబ్లీ ముందుంచారు. కాగా గోద్రా అనంతర ఘర్షణల నేపథ్యంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ గోద్రా వెళ్లి ఎస్6 కోచ్‌ను పరిశీలించి సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు నిరాధారమైనవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మోదీ గోద్రా వెళ్లారనే ఆరోపణలనూ నివేదిక తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లు పకడ్బందీ వ్యూహంతో చేపట్టినవి కాదని తేల్చిచెప్పింది. గోద్రా అనంతరం అల్లర్లను అదుపులోకి తీసుకునివచ్చి సాధారణ పరిస్థితి నెలకొనేలా చేయడంతో సంబంధిత అధికారులతో తాను ఎప్పటికప్పుడు సమీక్షించానని మోదీ చెప్పినట్టు నివేదిక పేర్కొంది. 2002లో జరిగిన గోద్రా అల్లర్లపై రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాలతో ఏర్పాటైన కమిషన్ 2014, నవంబర్ 18న తమ తుది నివేదికను సమర్పించింది. గోద్రా అల్లర్లలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వారిలో అత్యధికులు మైనారిటీలే కావడం గమనార్హం. గోద్రా రైల్వేస్టేషన్లో శబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీలను దగ్ధం చేసిన ఘనలో 59 మంది కరసేవకులు మరణించిన అనంతరం ఈ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. -
‘గోద్రా రైలు దహనం’ షూటింగ్
వడోదరా: ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వడోదరాలో జరుగుతుంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002 ఫిబ్రవరి 27న దుండగులు గోద్రా వద్ద సబర్మతి రైలులో బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. దీంతో గుజరాత్లో అలర్లు చెలరేగాయి. ఆ అలర్లలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనికి సంబంధించి మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ గోద్రా రైలు ప్రమాద ఘటననే మోదీ బయోపిక్ చిత్ర బృందం తెరకెక్కిస్తుంది. ఆదివారం రోజున వడోదరాలోని ప్రతాప్ నగర్, దోబి రైల్వే లైన్ మధ్యలో గోద్రా రైలు దహనం సీన్‌ను షూట్ చేశారు. పశ్చిమ రైల్వేస్, వడోదరా అగ్నిమాపక విభాగం అనుమతితో ఈ షూటింగ్ చేపట్టినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. షూటింగ్ కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు. చిత్రీకరణ కోసం ఉపయోగించిన బోగి నిరూపయోగమైందని పేర్కొన్నారు. వివేక్ ఒబ్రాయ్ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరబ్జీత్, మేరికోమ్ బయోపిక్‌లకు దర్శకత్వం వహించిన ఓమంగ్ తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో మనోజ్ జోషి, బొమన్ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నారు. -
విచారించాల్సిందేమీ లేదు..
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. గోధ్రాలో రైలు దగ్ధం అనంతరం గుల్బర్గ్ సొసైటీలో చెలరేగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనికి ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఇతర 59 మంది ఉన్నతాధికారులే కారణమని ఆరోపిస్తూ కేసు పునర్విచారణకు ఆదేశాలివ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే మోదీతోపాటు ఇతర అధికారులకు గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇచ్చింది. ఈ క్లీన్‌చిట్‌ను సమర్థిస్తూ దిగువ కోర్టు కూడా తీర్పునిచ్చింది. తాజాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ జాఫ్రీ అహ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ సోనియా గోకానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు పూర్తిగా విచారించిన ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సిందేమీ లేదని పేర్కొంటూ జాఫ్రీ పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే పిటిషనర్ ఈ కేసు పునర్విచారణ కోసం అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారు. గోద్రాలో రైలుకు నిప్పు పెట్టిన తర్వాత 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై కొందరు దుండగులు అల్లర్లకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో ఇషాన్ జాఫ్రీతో పాటు సుమారు 68 మంది దారుణంగా హత్యకు గురయ్యారు. -
మోడీని భుజానికెత్తుకోవడం సిగ్గుచేటు!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని గోద్రా మారణకాండకు కారణమైన నరేంద్రమోడీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేన్నోళ్ల కీర్తిస్తూ పులకించిపోతున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో జరిగిన సభల్లో చంద్రబాబు తీరు రాజును మించిన రాజభక్తిగా ఉందని మండిపడింది. కార్పొరేట్ శక్తుల ప్రతినిధి అయిన మోడీ ని చంద్రబాబు ప్రశంసిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా, ఎన్నికలను కాసుల జాతరగా మారుస్తున్న బూర్జువాపార్టీలు అధికారం కోసం గంగవైలెత్తుతున్నాయని, కోట్లకు కోట్లు వ్యయం చేస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. గుజారాత్ అభివృద్ధి నమూనా అంటూ ఊదరగొడుతున్న నరేంద్రమోడీ ఓ కార్పొరేట్ సంస్థకు 45వేల ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. మోడీ కరుడుగట్టిన మతోన్మాది, తిరోగమన ప్రతినిధి అని రామకృష్ణ పేర్కొన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 14వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉందని, దాన్ని ఎలా భర్తీ చేయాలో చెప్పకుండా లేనిపోని హామీలు గుప్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులను గెలిపించి పేద ప్రజల వాణి నూతన శాసనసభలో వినిపించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును, బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించాల్సిందిగా పిలుపిచ్చారు. -
గోధ్రా అల్లర్ల కేసుల పురోగతిపై సుప్రీం సంతృప్తి
న్యూఢిల్లీ: గుజరాత్లో గోద్రా దుర్ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల విచారణ పురోగతిపై సుప్రీంకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి నమోదైన 9 కేసులను సుప్రీం పర్యవేక్షణలో సిట్(ప్రత్యేక విచారణ బృందం) విచారిస్తోంది. ఇప్పటికే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి సిట్ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదిలావుంటే, కేసుల పురోగతిపై సిట్ గత ఫిబ్రవరి 27న సుప్రీంకు ఓ నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన సుప్రీం.. కేసుల విచారణలో మంచి పురోగతి కనిపిస్తోందని 9 కేసుల్లో ఆరు పూర్తయ్యాయని, 3 తుది దశలో ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. తమ ఆదేశాల మేరకు రోజు వారీ పద్ధతిలోనే సిట్ ఆయా కేసులు విచారించిందని, దీనికి సంబంధించి ఇక ఎలాంటి సూచనలూ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను ఆగస్టు 26కు వాయిదా వేశారు.