సాక్షి అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక కుటుంబంపై దాడి చేసి ఏడుగురుని హతమార్చి, ఒక మహిళపై సాముహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన బాధిత కుటుంబం ఆశ్చర్యపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం బిల్కిస్ బానో, ఆమె భర్త రసూల్ ఈ విషయమై మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
ఈ ఘోర సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు అయ్యిందని తాను తన భార్య, ఐదుగురు కుమారులకు ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పాడు. గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ ప్రకారం 11 మంది జీవిత ఖైదీలు విడుదల చేసేందుకు అనుమతివ్వడంతో వారు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేన్ని పరిగణలోని తీసుకుని వారిని విడుదల చేసిందనేది తమకు తెలియదని రసూల్ చెబుతున్నాడు.
ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని ఆవేదనగా చెప్పాడు రసూల్. అసలేం జరిగిందంటే మార్చి 3, 2002న గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో దాహుద్ జిల్లాలోని లిమ్‌ఖేడా తాలూకాలోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుంటుంబంపై ఒక గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ కుటుంబంలోని ఏడుగురిని పొట్టనబెట్టుకుంది ఆ దుండగుల గుంపు.
దీంతో ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు జనవరి 21, 2008న ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఐతే నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు మే 3, 2017న సీబీఐ కోర్టు శిక్షను సమర్థించింది. అలాగే ఇదే కేసుకి సంబంధించి ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లకు కూడా బాంబే హైకోర్టు శిక్ష విధించింది.
అంతేకాదు 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బిల్కిస్ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ భర్త రసూల్ సుప్రీం కోర్టు రూ. 50 లక్షలు పరిహారం ఇచ్చిందని వాటితోనే కొడుకుని చదివించుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఉద్యోగం ఇల్లు ఇప్పించలేదని రసూల్ చెబుతున్నాడు.
ఈ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు ఆ నిందితులు మాట్లాడుతూ...తాము దోషులుగా నిర్థారింపబడి సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాము. విడుదల చేయమని సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వ మమ్మలని విడుదల చేసింది. ప్రస్తుతం మేము మా కుటుంబాలను కలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆనందంగా చెబుతున్నారు.
(చదవండి: బస్సుని ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... 20 మంది సజీవ దహనం)
Comments
Please login to add a commentAdd a comment