అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. గోధ్రాలో రైలు దగ్ధం అనంతరం గుల్బర్గ్ సొసైటీలో చెలరేగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనికి ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఇతర 59 మంది ఉన్నతాధికారులే కారణమని ఆరోపిస్తూ కేసు పునర్విచారణకు ఆదేశాలివ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
అయితే మోదీతోపాటు ఇతర అధికారులకు గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ క్లీన్‌చిట్‌ను సమర్థిస్తూ దిగువ కోర్టు కూడా తీర్పునిచ్చింది. తాజాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ జాఫ్రీ అహ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ సోనియా గోకానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు పూర్తిగా విచారించిన ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సిందేమీ లేదని పేర్కొంటూ జాఫ్రీ పిటిషన్‌ను కొట్టివేశారు.
అయితే పిటిషనర్ ఈ కేసు పునర్విచారణ కోసం అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారు. గోద్రాలో రైలుకు నిప్పు పెట్టిన తర్వాత 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై కొందరు దుండగులు అల్లర్లకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో ఇషాన్ జాఫ్రీతో పాటు సుమారు 68 మంది దారుణంగా హత్యకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment