న్యూఢిల్లీ: గుజరాత్‌లో గోద్రా దుర్ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల విచారణ పురోగతిపై సుప్రీంకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి నమోదైన 9 కేసులను సుప్రీం పర్యవేక్షణలో సిట్(ప్రత్యేక విచారణ బృందం) విచారిస్తోంది. ఇప్పటికే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి సిట్ క్లీన్‌చిట్ కూడా ఇచ్చింది. ఇదిలావుంటే, కేసుల పురోగతిపై సిట్ గత ఫిబ్రవరి 27న సుప్రీంకు ఓ నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన సుప్రీం.. కేసుల విచారణలో మంచి పురోగతి కనిపిస్తోందని 9 కేసుల్లో ఆరు పూర్తయ్యాయని, 3 తుది దశలో ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది.
తమ ఆదేశాల మేరకు రోజు వారీ పద్ధతిలోనే సిట్ ఆయా కేసులు విచారించిందని, దీనికి సంబంధించి ఇక ఎలాంటి సూచనలూ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను ఆగస్టు 26కు వాయిదా వేశారు.