జేసీ దివాకర్రెడ్డికి అసెంబ్లీలో ఏం పని ?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం అనంతపురంలో మండిపడ్డారు. కాల్మనీ కేసులో ఆరోపణలున్న టీడీపీ నేతలను విచారించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో ప్రతిపక్షం లేకుండానే బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో ఇద్దరిదీ తప్పేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం తప్పని అన్నారు.
రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు. అలాగే అనంతపురం లోక్సభ సభ్యుడు, టీడీపీ నాయకుడు జేసీ దివాకరరెడ్డిపై కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్కు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం పని అని ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని రామకృష్ణ ఈ సందర్బంగా ప్రశ్నించారు.