బాబుది అధికార దాహం: పి.మధు
సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ధ్వజం
చంద్రబాబుకు నిలకడైన సిద్ధాంతం లేదు.. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు పొత్తెలా పెట్టుకుంటారు?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహంతో అల్లాడుతున్నారని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. బాబుకు నిలకడైన సిద్ధాంతం లేదన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గోద్రా సంఘటన అనంతరం నరేంద్రమోడీని తిట్టి, ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుకు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీజేపీ ఉంటే తప్ప మనుగడ లేదన్న భావన చంద్రబాబులోనే ఉంటే సామాన్య కార్యకర్తలకు ఏం భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. మునిగిపోతున్న టీడీపీ గడ్డిపోచను పట్టుకుని బయటపడాలని చూస్తోందని చమత్కరించారు. చంద్రబాబు రోడ్ షోల పేరుతో జనసమీకరణ చేసినా, సాధారణ ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత కల్పించలేకపోతున్నారని చెప్పారు. అన్ని పదవులూ అనుభవించిన జేసీ దివాకర్‌రెడ్డి, పురందేశ్వరీ, రాయపాటి వంటి వారు మళ్లీ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ను వదలాలని సీపీఐకి సలహా
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ ఎవర్ని ఓడించాలని చూస్తోందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్నది వామపక్షాల విధానం. దాన్ని పక్కన బెట్టినప్పుడు కాంగ్రెస్‌తోనే ఎందుకు? బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు. ఆ పార్టీ కూడా తెలంగాణ కోసం పోరాడినదే గదా! ఈ రెండూ కార్పొరేట్లకు ఊడిగం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. ఈ విషయాలన్నీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న వారికి తెలియదా? ఇది మౌలిక సిద్ధాంతంతో రాజీ పడటం, రాజ కీయ దివాళాకోరుతనమే’ అని అన్నారు.
వైఎస్సార్‌సీపీపై మైనారిటీల ఆశలు
బీజేపీ, టీడీపీల వైఖరితో విసిగిన ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైఎస్ కుమారుడైన జగన్ వారికి రక్షణగా ఉంటారని భావిస్తున్నారని తెలిపారు. అయితే, జగన్ ఇటీవలి కాలంలో నరేంద్రమోడీని, బీజేపీని ఒక్క మాట అనకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదన్నారు. దాదాపు 300 లోక్‌సభ స్థానాల్లో అస్థిత్వమే లేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీతో పొత్తుకు తమకు అభ్యంతరం లేదని, తాము చేసిన అనేక పోరాటాల్లో విజయమ్మ సహా అనేకమంది వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారని తెలిపారు.