సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంమధ్యలోనే సీపీఎం పార్టీ నేత మధు బయటకు వచ్చేశారు. అఖిలపక్షం చేసిన తీర్మానం రాష్ట్రానికి మేలు చేసేలా లేదని విమర్శించారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణం తెలుగు దేశం, బీజేపీ పార్టీలే కారణమని ఆయన దుయ్యపట్టారు. ఏపీకి అన్యాయం చేసిన పాపం బీజేపీతో పాటు టీడీపీకి ఉంటుందన్నారు. ‘ దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు’ అని మధు పేర్కొన్నారు. అఖిలపక్ష డ్రామాతో చంద్రబాబు చేసిన పాపాన్ని అందరికి రుద్దాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ...‘బీజేపీ నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పోలవరం నిర్వాసితుల డబ్బుకి కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ అంటోంది. బీజేపీ ఎంత అన్యాయం చేసిందో టీడీపీ అంతే అన్యాయం చేసింది. మేం ఎన్నిసార్లు అడిగినా సీఎం లెక్కలు చెప‍్పలేదు. మేం హోదా కోసం ఆందోళన చేస్తే మమ‍్మల్ని అరెస్ట్ చేసి, తులనాడారు. ఆ విషయాన్ని చంద్రాబాబును నిలదీశాను. తీర్మానం చేస్తామన్నారు...దాన్ని వ్యతిరేకించాను.
రాష్ట్రానికి అన్యాయం చేసింది టీడీపీ, బీజేపీనే. చేసిన పాపాలన్నీ చేసి...అమ్మ, నాన్నని చంపినవాడు తల్లిదండ్రులు లేనివాడిని క్షమించండి అన్నట్లు...రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. కేంద్రం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోంది. మేం మీతో కలిసి పోరాటం చేయమని ఖరాఖండిగా చెప్పాం. సీఎం ఎక్కడా పోరాటం చేస్తామని చెప్పలేదు. మేం పోరాడినప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన లేచారు. టీడీపీతో కలిసి పోరాటం చేసే ప్రసక్తే లేదు.’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment