
సాక్షి, సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పినట్టు తెలంగాణకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్వీ జిల్లా శిక్షణతరగతుల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఎవరిని అడిగి రాష్ట్ర విభజన చేశారని పార్లమెంట్‌లో టీడీపీ నాయకులు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 1956లో ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనే అప్పటి ప్రధాని నెహ్రూ, తెలం గాణను ఏపీలో కలిపారా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు విభజన సందర్భంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపారని, పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణలోని ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణపై విషం కక్కిన చంద్రబాబుతో దోస్తీకి తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం కావడం సిగ్గుమాలిన చర్యగా హరీశ్ అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు తరలిపోతాయని, యువత నిరుద్యోగులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు.