
సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలని నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు అక్కడికి తరలివెళ్తాయని, దీంతో స్థానికులు రోడ్డు మీద పడతారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రూ.26 కోట్లతో నిర్మించ తలపెట్టిన అండర్‌పాస్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఏపీకి హోదా కల్పిస్తామ ని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానించడంపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి ఏపీకి పరిశ్రమలు తరలివెళ్తే మనమేం చేయాలన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ ఇవ్వలేదని మండిపడ్డారు.
‘సింగూరు’కు కాళేశ్వరం నీళ్లు...
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సింగూరు ప్రాజెక్టును నింపుతామని హరీశ్‌రావు ప్రకటించారు. ‘హస్తం అంటేనే ఉత్త చేతులు.. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు మేలు జరగలేదని’విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం నాయకులు, కార్యకర్తలకే మేలు జరిగిందన్నారు. నిరుపేదలే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
తాము చేసిన అభివృద్ధిని ‘కల్యాణలక్ష్మి’చెక్కులు అందుకుంటున్న తల్లిదండ్రుల కళ్లలో, పింఛన్ అందుకుంటున్న వృద్ధుల బోసి నవ్వుల్లో, ఉచిత కరెంటు అందుకుంటున్న రైతు మనసులో చూడాలని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ ఇస్నాపూర్ చౌరస్తా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.