సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని, తొలిసంతకం దానిపైనే పెడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలు సభలో ఇచ్చిన హామీ హాస్యాస్పదంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే విభజన హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పించేవారని, ప్రత్యేక హోదాను కూడా చట్టంలో పెట్టి ఉండేవారని గుర్తుచేసుకుంటున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టి ఉంటే ఇవాళ మాట తప్పిన భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండేదని, అమలుచేయాల్సిందిగా కోర్టుకు వెళ్లిఅయినా అమలు చేయించుకునే అవకాశం ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. చట్టంలో పెట్టి ఉంటే ప్రభుత్వం చేయకపోతే నిలదీయడానికి, కోర్టుకు వెళ్లి అమలు చేయించుకోవడానికి వీలుండేది. అలాంటి అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్సేనన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు.
దారుణంగా వంచించి.. ఇప్పుడు హామీలా..
ఒక రాష్ట్రాన్ని విభజించేటపుడు ఒక ప్రాంతం రెవెన్యూ పరంగా నష్టపోయే ప్రమాదం ఉంటే దాని గురించి కూలంకషంగా చర్చించి తగిన జాగ్రత్తలు పొందుపరచాల్సి ఉంటుంది. కానీ అలాంటివేవీ జరపకుండా హడావిడిగా పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాల కోసం మరో ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా వంచించిందని వారు విమర్శిస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఇప్పటికీ కనిపించడం లేదని పరిశీలకులంటున్నారు. అందువల్లే రాహుల్ ఇపుడు పర్యటనలు జరుపుతూ గుప్పిస్తున్న హామీలను విశ్వశించే పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు.
తప్పని సరిగా అమలు చేయాలని రాయలేదు..
ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ను విభజన చట్టంలో పెట్టినట్లయితే సుప్రీంకోర్టుకైనా వెళ్లి దానిని సాధించుకునే అవకాశం ఉండేది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల మరింత నష్టపోయారు.. దారుణంగా మోసపోయారు. పోనీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలనైనా కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అని విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టిందా అంటే అదీ లేదు. 13వ షెడ్యూలులో పెట్టిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సినవేననే అర్ధంలో చట్టంలో రాయకుండా కాంగ్రెస్ పార్టీ మరో ద్రోహం చేసింది. 13వ షెడ్యూలులో పెట్టిన .. రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకు, క్రూడాయిల్ రిఫైనరీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు ఇలా ఏది తీసుకున్నా అన్నీ చట్టంలో.. ‘మే.. మే.. మే’ అని పెట్టింది. అంటే చేయవచ్చు అనే అర్ధంలో రాశారన్నమాట. ‘మే’ అని కాకుండా ‘షల్’ అని పెట్టి ఉంటే తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది.
ఆ రోజు చట్టంలో షల్ అని పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కచ్చితంతా చేయాలి అనే అర్ధంలో షల్ అని పెట్టి ఉంటే ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వారు కూడా భాగస్వాములే. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆ రెండు పార్టీలు అలా తుంగలో తొక్కాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది. ఒకవైపు అడ్డగోలుగా, అన్యాయంగా విభజించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలూ వహించకుండా వంచించిన కాంగ్రెస్‌పార్టీని ఏపీ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాకరాక చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ అవినీతిపై విమర్శలు కురిపించడం బాగానే ఉంది కానీ రాష్ట్రంలో విశృంఖలంగా సాగుతున్న చంద్రబాబు అవినీతిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. చంద్రబాబు అవినీతి గురించి యావద్దేశమంతా చర్చజరుగుతున్నా రాహుల్ గాంధీ కనీసం ప్రస్తావించకపోవడం విశేషమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రానికి ద్రోహం.. కాంగ్రెస్ నిర్వాకం..
Published Wed, Sep 19 2018 4:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment