గర్జించిన కాకినాడ | YSRCP Vanchana pai Garjana Meeting In Kakinada East Godavari | Sakshi
Sakshi News home page

గర్జించిన కాకినాడ

Published Sat, Dec 1 2018 8:12 AM | Last Updated on Sat, Dec 1 2018 8:12 AM

YSRCP Vanchana pai Garjana Meeting In Kakinada East Godavari - Sakshi

కాకినాడ సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై ... ప్రత్యేక హోదా కావాలంటూ కాకినాడ మరోసారి గర్జించింది. బాలాజీ చెరువు కూడలి జన సంద్రమైంది. దిక్కులు పిక్కటిల్లేలా  వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఉదయం ఎనిమిది గంటలకుప్రారంభమై పది గంటలయ్యేసరికి జన ప్రవాహంగా మారిపోయింది. పూటకో మాట...రోజుకో మెలికపెడుతూ ఆది నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన టీడీపీ వైఖరిపైజనాగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది.విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ ఆడుతున్న నయవంచక నాటకాలపై నిరసన గళం విప్పారు. కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సభలో హోదా ఇవ్వాల్సిందేనని పెద్ద ఎత్తున గర్జించారు. వంచనపై  దీక్షకు  ప్రజా మద్దతు,సంఘీభావం లభించింది. పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపింది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉదయం 9.50 గంటలకు జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతంతో సభ ప్రారంభం కాగా, సర్వమత ప్రార్థనలతో దీక్షకు శ్రీకారం చుట్టారు. హోదా కోసం పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన లోకసభ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్‌లు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం చూపించిన చిత్తశుద్ధిపై పార్టీ నేతలతో సహా వివిధ వర్గాల వారు ఉచిత రీతిన సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నేతలంతా నల్ల దుస్తులతో దీక్షల్లో పాల్గొని నిరసన గళం వినిపించారు. సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా దీక్షను చేపట్టారు. తరలివచ్చిన ప్రజలు ఆద్యంతం అక్కడే ఉండి సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో పాల్గొన్న వారికితొలుత హిజ్రాలు మద్దతు పలికారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్వాడీ సమాజం ప్రతినిధులు వేదికపైకి వచ్చి హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసిన ఎంపీలను సన్మానించారు. తదుపరి న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘం నేతలు పెద్ద ఎత్తున వచ్చి, పదవులను త్యాగం చేసిన ఎంపీలను ఉచిత రీతిలో సత్కరించారు. తృణప్రాయంగా పదవులను త్వజించిన నేతలకు ఎంత గౌరవించినా తక్కువేనని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని

అభినందించారు..చంద్రబాబు మోసాలపై నేతల గళం...
నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను, హామీలు అమలు చేయడంలో చేస్తున్న వంచనపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నయవంచనకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినటు వివరించారు. ప్రజల్ని మోసం చేయకుండా వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని, ఏఏ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా దోపిడీ చేస్తున్నారని సమగ్రంగా వివరించారు. తండ్రి కొడుకులైన చంద్రబాబు,లోకేషే కాకుండా వారి బినామీలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్‌ చేసిన అవినీతి భాగోతాలను బయటపెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదని, ప్రజాధనాన్ని మింగేశాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల్ని నయవంచనకు గురి చేయడమే కాకుండా తానేదో ఉద్దరించినట్టుగా  అనుకూల మీడియాలో  ఊదరగొట్టి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.

హోదా కోసం తొలినుంచి పోరాడుతున్నది వైఎస్సార్‌ సీపీ అని గుర్తు చేశారు. తన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనో, తన బినామీల బండారం వెలుగు చూస్తుందనో ఐటీ, సీబీఐ, ఈడీ అధికారుల విచారణలను అడ్డుకునేందుకు చంద్రబాబు శతవిధాలా యత్నిస్తున్నారని విమర్శించారు.

పవన్‌ తీరును ఎండగట్టిన నేతలు
ఎక్కడైనా అధికార పక్షాన్ని నిలదీయడం, ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలను ప్రశ్నించడం చూశాం గానీ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేసే నేతగా ఒక్క పవన్‌ కల్యాణ్‌నే చూశామని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, కాంగ్రెస్, ఇటు పవన్‌ కల్యాణ్‌లు జగన్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడాన్ని తప్పు పట్టడమే కాకుండా వారి లోపాయికారీ కుట్రలను ఎండగట్టారు. ఇక కోడి కత్తే కదా, దానికంత రచ్చ అని పవన్‌ చేసే వ్యాఖ్యలపై కూడా అనిల్‌కుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ కోడి కత్తితో ఒక్కసారి చిన్న పిల్లాడితో రక్కిస్తే ఏమవుతుందో పవన్‌ కల్యాణ్‌కు తెలుస్తుందని సుతిమెత్తని చురక అంటించారు. ఇదే తరహాలో మిగతా నేతలు కూడా పవన్‌ కళ్యాణ్‌ తీరును తప్పుపట్టారు.

వంచనపై గర్జన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,  పార్టీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొప్పర మోహన్‌రావు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు జిల్లా ముఖ్యనేత గౌరు వెంకటరెడ్డి, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి , తిప్పల నాగిరెడ్డి, కొయ్యా ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తానేటి వనిత, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బూసి వినీత. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కో–ఆర్డినేటర్లు వాసుబాబు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్‌ కవురు శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి,  కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, మిండకుదిటి మోహన్,  కర్రి నారాయణరావు, కొలగాని దుర్గాప్రసాద్, ఇనుకొండ పట్టాభిరామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంపని రామకృష్ణంరాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల బూత్‌కమిటీల ఇన్‌చార్జ్‌ వీవీఎస్‌ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జంపన రామకృష్ణంరాజు(బుజ్జిరాజు),  నాయకులు బుర్రా అనుబాబు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, కాకినాడ పార్లమెంట్‌జిల్లా బూత్‌కమిటీల ఇన్‌చార్జ్‌ ఒమ్మిరఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement