ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చామని, ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. హోదా సాధించే విషయంలో టీడీపీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకే ఆర్థిక సాయం ప్రకటించారని, ఈ ప్యాకేజీకి ధన్యవాద తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఇంతకీ ఈ ధన్యవాద తీర్మానాన్ని చంద్రబాబు విత్‌డ్రా చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీపై ధన్యవాద తీర్మానం ఎలా పెట్టారని నిలదీశారు. నాలుగేళ్లు కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కాదా? అని, ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని టీడీపీ కోరలేదా అని మండిపడ్డారు.