సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన రేపటి బంద్‌తో జనజీవనం స్తంభించి ఆ సెగ ఢిల్లీకి తాకాలని అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధించేవారన్నారు. ఏపీ ప్రజలకు జీవన్మరణ సమస్యయిన ప్రత్యేక హోదా కోసం రేపు జరగబోయే బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
హోదా పోరాటంలో కలిసి రావాలి
ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ప్రత్యేక హోదా పోరాటంలో తమతో కలిసి రావాలని కోరారు. ప్యాకేజీకి ధన్యవాదాలు చెప్పిన సీఎం చంద్రబాబు ఏపీకి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ముంపు మండలాల కోసం పంతం పట్టిన చంద్రబాబు.. హోదా కోసం ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. బాబు చేతిలో మరోసారి మోసపోవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏపీపై కరుణ, జాలి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని వర్గాలు కలిసి రావాలన్నారు.
ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదు
టీడీపీ, ఎన్డీయే నుంచి బయటికొచ్చి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హోదా క్రెడిట్ వైఎస్సార్ సీపీకి వెళ్తుందనే భయంతోనే టీడీపీ నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా సాధించడంతోపాటు, పోలవరం కూడా పూర్తయ్యేదన్నారు. తెలంగాణ సాధ్యం అయినప్పడు, ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఏపీలో వైఎస్సార్‌సీపీకి అధికారం ఇచ్చి.. మొత్తం ఎంపీలను గెలిపిస్తే హోదా సాధించి చూపెడతామన్నారు. ఏపీకి కాంగ్రెస్ ప్రధాన విలన్ అని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఎవరు హోదా ఇస్తే కేంద్రంలో వారికే తాము మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేదని పేర్కొన్నారు.
మహానేత పాలన మళ్లీ రావాలంటే..
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో పాలన ఏ విధంగా సాగిందో.. ఆయన మరణానంతరం పాలన ఎలా ఉందో ప్రజల చూశారని ఆయన తెలిపారు. ఆ సమయంలో వైఎస్ జగన్ సీఎం అయితే రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు రెట్టింపు వేగంతో ప్రజలకు అందేవని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే మహానేత పాలన మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హోదాకు ఫైనాన్స్ కమిషన్ అడ్డు చెప్పలేదని వైఎస్ జగన్ అసెంబ్లీ లోపల, బయట ఎన్నో సార్లు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు వాటిని తోసిపుచ్చిన టీడీపీ.. వైఎస్ జగన్ మాటలనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో అవిశ్వాసం ప్రవేశపెడుతున్న సమయంలో క్రెడిట్ కోసం టీడీపీ నాటకాలు మొదలు పెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వలసలు తప్పేవని, ఉపాధి అవకాశాలు పెరిగేవని ఆయన అన్నారు. బాబు ఏపీకి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
చంద్రబాబులా ‘యూ టర్న్’లు తీసుకోలేదు
మాట మార్చడం, మీడియాను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటని ఆయన విమర్శించారు. అలాంటి నీతిమాలిన పనులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడు పాల్పడదని స్పష్టం చేశారు. హోదా విషయంలో చంద్రబాబు వైఖరి వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్యాకేజీకి ఆయన అంగీకరించకుంటే నేడు పరిస్థితి ఇలా ఉండేదా అని ప్రశ్నించారు. తొలి నుంచి ఒకటే నినాదంతో వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment