
సజ్జల రామకృష్ణ రెడ్డి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రానికి హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ జూన్ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్షను చేపట్టనుందని రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న విశాఖలో బీజేపీ, టీడీపీ చేసిన మోసాలకు వంచనపై గర్జన దీక్ష విజయవంతమైందని తెలిపారు. అదే స్పూర్తితో జూన్ 2న నెల్లూరులోని వీఆర్ కళాశాల మైదానంలో దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన బీజేపీకి, ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్న టీడీపీకి వ్యతిరేకంగా జరిగేదే వంచనపై దీక్ష అని ఆయన తెలిపారు.
నిర్లక్ష్య పాలనకు నిలువెత్తు నిదర్శనం : పెట్రోలు, నిత్యావసర ధరలే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిలువెత్తు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే.. కేంద్రంతో పనిలేకుండా రాష్ట్రంలో వాటి రేట్లు తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని గుర్తుచేశారు. మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నినాదిస్తూ.. పోరాడుతోన్నది వైఎస్సార్‌సీపీ మాత్రమే అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూన్ 2న నెల్లూరులో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వంచనపై గర్జన దీక్ష జరుగుతుందని తెలిపారు. గర్జన దీక్షను జయప్రదం చేయండని బొత్స సత్యనారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment