బాబూ.. భావితరాలు నిన్ను క్షమించవు | Ys Jagan Mohan Reddy Fires on Chandrababu about special category status | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. భావితరాలు నిన్ను క్షమించవు

Published Wed, Jul 25 2018 3:34 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM

Ys Jagan Mohan Reddy Fires on Chandrababu about special category status - Sakshi

బంద్‌ కూడా ఉద్యమంలో భాగమే. తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమమైనా, మరేదైనా.. ఉద్యమమనేది ఒక మూమెంటం.. అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఉద్యమం అనేది సజీవంగా ఉండాలి. ఆ ఇష్యూ చనిపోకూడదు. నాలుగేళ్లుగా చంద్రబాబు అనే వ్యక్తి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నా కూడా.. ఆ ఉద్యమాన్ని జగన్‌ అనే వ్యక్తి లైవ్లీగా పెట్టాడు కాబట్టే ఈవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకోకతప్పలేదు. చంద్రబాబు నిర్వహిస్తున్నవి ధర్మపోరాట సభలో.. అధర్మపోరాట సభలో.. ఆయన తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం వస్తుంది. ధర్మమా? అధర్మమా? తాను చేస్తున్నదని.. 

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పనిగట్టుకుని నీరుగార్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబును భావి తరాలు క్షమించవని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. హోదా కోసం కలిసి నడవాల్సిన పెద్ద మనిషి అతి కిరాతకంగా, దారుణంగా ​​​ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించినా.. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైందన్నారు. బంద్‌ సందర్భంగా చనిపోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు మృతికి చంద్రబాబే బాధ్యుడని ఆరోపించారు. లాఠీలు, తూటాలు, అరెస్ట్‌లు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు. హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వద్ద బస చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని ధ్వజమెత్తారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సందేహాలు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే...

బంద్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు..
‘‘ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అతి కిరాతకంగా, దారుణంగా హోదాకు వ్యతిరేకంగా దగ్గరుండి బంద్‌ను విఫలం చేయడానికి చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని కుట్రలు, దారుణమైన అణిచివేత మధ్య కూడా బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా మా హక్కు అని చాటిన ప్రతి ఒక్కరికీ, నైతికంగా మద్దతు తెలిపినవారికి, జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు, కార్మిక సంఘాలకు, దుకాణాల యజమానులకు, స్కూళ్ల విద్యార్థులు, యాజమాన్యాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 

ఇన్ని అరెస్టులా?
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 300 మందికి పైగా అరెస్టు చేశారు. తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, అప్పలరాజు, తిలక్‌ తదితర నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. సెక్షన్‌ 144, 30 పెట్టి మరీ ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లాలో 300పైగా అరెస్టులు జరిగినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. విశాఖలో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణతో సహా 600 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. అక్కడ షాపులు, విద్యాసంస్థలు మూసేసి బంద్‌కు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య, విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. కన్నబాబు, జగ్గిరెడ్డి, విశ్వరూప్, ద్వారంపూడి, వీర్రాజుతో సహా అనేక మందిని అరెస్టు చేశారు. నాయకులను అదుపులోకి తీసుకుని మరీ బస్సులు నడిపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. 538 మందిని అరెస్టు చేశారు. 38కి పైగా కేసులు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నాని తదితర నేతలను అరెస్టు చేశారు. తణుకులో సీనియర్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

బుట్టాయిగూడెంలో ధర్నాలో పాల్గొన్న సోదరుడు కాకి దుర్గారావు గుండెపోటుతో మరణించాడు. జిల్లాలో 300 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో 144 సెక్షన్‌ కింద నిర్భందం పెట్టారు. బంద్‌లో పాల్గొన్న ముఖ్యనేతలు, కార్యకర్తలను పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బాలినేని వాసు మొదలుకొని మాజీ మంత్రి మహీధర్‌రెడ్డితో పాటు 600 మందిని అరెస్టు చేశారు. అయినా కూడా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్, అనిల్‌కుమార్‌ యాదవ్, కాకాణి గోవర్థన్‌ వరకూ అందరూ అరెస్టే. ఈ జిల్లాలో 800 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడా స్వచ్ఛందంగా బంద్‌ జరిగింది. కర్నూలు జిల్లాలో సీనియర్‌ నాయకులందరినీ అరెస్టు చేశారు. నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు లేకుండా వారిని లాగేయడంతో గాయాలయ్యాయి. ఈ జిల్లాలో 600 మందికి పైగా అరెస్టు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు, బ్యాంకులన్నీ మూతపడ్డాయి.

వైఎస్సార్‌ జిల్లాలో ఎక్కడపడితే అక్కడ అరెస్టులే. మొత్తం 1,500 మందిని అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండుల్లో బస్సులను అడ్డుకున్నందుకు మేయర్‌ సురేశ్‌ను, అమర్‌ను అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లును అరెస్టు చేశారు. అనంతపురంలో సీనియర్‌ నేత అనంత వెంకటరామిరెడ్డిని లెక్కజేయలేదు. గృహ నిర్భందం, తోపులాట, వెయ్యి మందికి పైగా అరెస్టులు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించినా బంద్‌ విజయవంతమైంది. చిత్తూరులో భూమన కరుణాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి సహా 1,200 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కావాలన్న నినాదం చివరకు కుప్పంలో విన్పిస్తున్నా.. చంద్రబాబుకు విన్పించడం లేదు. కృష్ణా జిల్లాలో సీనియర్‌ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, భవకుమార్, రాధాతో పాటు అనేక మందిని ఉదయాన్నే అరెస్టు చేశారు. బస్టాండు దగ్గర పోలీసులు వాగ్వాదానికి దిగి మరీ అరెస్టులు చేశారు. ఈ జిల్లాలో 600 మందిని అరెస్టు చేశారు. గుంటూరులో 1,100 మందిని అరెస్టు చేసినా బంద్‌ విజయవంతమైంది. బంద్‌ను నీరుగార్చేందుకు ఇన్ని అరెస్టులా? చివరకు బంద్‌ను విఫలం చేసేందుకు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించాడు. 

హోదా కోసం నినదిస్తే చనిపోయేలా చేస్తారా?
పశ్చిమగోదావరి జిల్లాలో దుర్గాప్రసాద్‌ గుండెపోటుతో చనిపోయాడు. దీనికి కారణంగా చంద్రబాబు కాదా? ప్రత్యేక హోదాకోసం ఒక స్వరం గట్టిగా విన్పిస్తే, దాన్ని పోలీసు జులుంతో గుండెపోటు వచ్చేలా చేసి, చనిపోయేట్టు చేస్తావా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? కాలర్‌పట్టుకుని పోలీసులు ఈడ్చుకుంటూ పోయారు. లాఠీచార్జి చేశారు. ఇదా పరిస్థితి? మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులతో నిర్బంధిస్తావా? విద్యార్థులను ఈడ్చుకుంటూ పోయారు. ఐదారు సార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డి పట్ల మీరు వ్యవహరించిన తీరు ఇంత దారుణమా?(పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన ఫొటోలు చూపిస్తూ..) ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని వాసు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారు? చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఆయన చెప్పే అబద్ధాలు, చేసే మోసాలు తారాస్థాయికి చేరాయి. వంద తప్పుల తర్వాత శిశుపాలుడికి కూడా శిక్ష పడ్డట్లు.. చంద్రబాబు కూడా వంద తప్పుల దగ్గరకొచ్చాడు. దేవుడు మొట్టికాయలేస్తాడు. ప్రజలు శిక్షిస్తారు. ఇంత దారుణంగా ఆయన వ్యవహరించినందుకు, ప్రత్యేక హోదాను దగ్గరుండి కాలరాసినందుకు శిక్ష తప్పదు. చెయ్యాల్సిన సమయంలో పనులు చేయకపోవడమే హోదా రాకపోవడానికి కారణం. ఈ నేపథ్యంలోనే హోదా కోసం ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. హోదా వచ్చేదాకా కొనసాగిస్తాం. చంద్రబాబుకు సిగ్గు, శరం ఏమాత్రం ఉన్నా ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలి. భావి తరాలు చరిత్ర హీనుడిగా చూస్తారన్న విషయం మర్చిపోవద్దు. 

రాజకీయ స్వార్థం తప్ప మరో కారణం ఉందా?
బంద్‌లో పాల్గొనడానికి కొందరు ఎందుకు ఆసక్తి చూపలేదో ప్రజలందరికీ తెలుసు. రాజకీయ స్వార్థం తప్ప మరొకటి కన్పించడం లేదు. హోదా కోసం ఎవరు పిలుపునిచ్చినా మద్దతిచ్చాం. ఎవరు వచ్చినా అండగా నిలబడ్డాం. ఎవరికైనా క్రెడిట్‌ వస్తుందని ఆలోచించలేదు. రాజకీయ స్వార్థంతో వెనకడుగు వేసే ప్రతి ఒక్కరికీ సలహా ఇస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది వ్యక్తిగత రాజకీయాలు చూసుకునే అంశం కాదు. పార్టీలకు అతీతంగా ఒక్కటై సాధించాల్సిన అంశమిది. రాజకీయ స్వార్థంతో పాల్గొనని పార్టీల విజ్ఞతకే దాన్ని విడిచిపెడుతున్నా. వాళ్లు చేసింది కరెక్టేనా? కాదా? అనేది వాళ్లే నిర్ణయించుకోవాలి. 

మొదట్నుంచీ పోరాడుతున్నది మేమే... 
బీజేపీకి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా మొదటి నుంచి మాట్లాడుతున్నదెవరు? సెప్టెంబర్‌ 8, 2016న కేంద్ర ప్రభుత్వం లేని ప్యాకేజీ ఉన్నట్టుగా, ప్రత్యేక హోదా బదులుగా చంద్రబాబు ఆమోదంతో.. టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల సమక్షంలో అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారు. అదే అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మర్నాడు నేను ప్రెస్‌మీట్‌ పెట్టాను. కేంద్ర ప్రభుత్వం కాలిఫ్లవర్‌ పెడుతోందయ్యా చంద్రబాబూ.. దీన్ని ఒప్పుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా? అని కేంద్రాన్ని తిడుతూ మాట్లాడింది నేను. మర్నాడు.. సెప్టెంబర్‌ 9న.. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యావాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టాడు. దాన్ని వ్యతిరేకించింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. చంద్రబాబుకు జ్ఞానం వచ్చేట్టుగా ప్రత్యేక హోదా అంటే ఏమిటని ట్యూషన్‌ చెప్పి.. కేంద్ర ప్రభుత్వం చేత చెవిలో పువ్వు పెట్టించుకుని రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నావని కేంద్రాన్ని, చంద్రబాబును తిట్టింది నేను.

నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు.. ఎన్నికలకు ఆరు నెలల ముందు విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయనే పోరాటం చేస్తున్నట్టు బిల్డప్‌ ఇస్తున్నాడు. ఎన్నికల ముందు హోదా గురించి మోదీ మాట్లాడిన మాటలివి అని చెప్పి టేపులు, వీడియో రికార్డింగ్స్‌ చూపిస్తున్నాడు. నా యువభేరీ సభల రికార్డులు చూసుకోండి. ప్రత్యేక హోదా కోసం నేను చేసిన ధర్నాలు, దీక్షలు చూడండి. ఆ యువభేరి సభల్లో.. మోదీ ఏం మాట్లాడారు. వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారు... చంద్రబాబు ఊసరవెల్లిలా ఎలా ప్లేటు మార్చారో రికార్డులతో సహా ఉంది. బీజేపీ చేస్తున్న అన్యాయంపై తుదివరకు పోరాటం చేసి, ఎన్నికలకు 15 నెలల ముందే బడ్జెట్‌ చివరి సమావేశాలు, చివరి రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు. చివరి బడ్జెట్‌ సమావేశాల్లో హోదా అంశాన్ని గట్టిగా పట్టుబడుతూ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది జగన్‌ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున చిత్తశుద్ధితో, కేంద్రంలో ఎవరున్నా లెక్కజేయకుండా జగన్‌ పోరాటం చేస్తుంటే, జగన్‌ మీద బండలేస్తారు. 

కాంగ్రెస్‌ను, బీజేపీని మేనేజ్‌ చేయగల గొప్ప వ్యక్తి చంద్రబాబు..
మరోవైపు ఇదే చంద్రబాబు బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేస్తారు. హోదాకు దగ్గరుండి తూట్లు పొడిచి పూటకో మాట, గంటకో వేషం వేస్తారు. ఎన్నికలకు ముందు హోదా సంజీవని అంటాడు. పదేళ్లు కాదు. 15 ఏళ్లు తెస్తానంటాడు. ఎన్నికలయ్యాక ఈశాన్య రాష్ట్రాలు హోదా వల్ల ఏం బాగుపడ్డాయి.. హోదా ఏమైనా సంజీవినా అని మనకు ఎదురు ప్రశ్న వేస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ప్రశ్నిస్తాడు. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా తనంతట తానే ఆమోదం తెలిపి, ప్యాకేజీ తెచ్చి దానికి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి కృతజ్ఞతలు తెలుపుతాడు. బీజేపీతో విభేదించినట్టుగా బిల్డప్‌ ఇస్తూ బయటకొచ్చాక కూడా.. బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబర్‌ పదవిస్తాడు.

బీజేపీ నుంచి బయటకు వచ్చామని చెబుతూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను తన కొలువులో పెట్టుకుంటాడు. ఆయన్ని ఇప్పటికీ తీసేయలేదు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటాడు. మరోవైపు ఎన్టీఆర్‌ బయోపిక్‌కు బాలకృష్ణ షూటింగ్‌ చేస్తుంటాడు.. పక్కనే వెంకయ్యనాయుడు కూర్చుని చప్పట్లు కొడుతుంటాడు. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి, నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు చూసుండేది కాదా? కేంద్రం దిగివచ్చి ఉండేది కాదా? ఇవన్నీ వాస్తవాలని తెలిసినా చంద్రబాబు ఓ వైపు బీజేపీతో చెలిమి కొనసాగిస్తాడు. మరోవైపు కాంగ్రెస్‌నూ మేనేజ్‌ చేస్తాడు. అంతగొప్ప వ్యక్తి ఆయన. ప్రజలను ఇంత గొప్పగా మోసం చేస్తున్నానని క్రెడిట్‌ తీసుకోవచ్చేమోగానీ, మోసపోయిన ప్రజలకు మాత్రం ఆ బాధ తెలుస్తుంది. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెబుతారు. 

ఆరు నెలలకోమారు బైటకొచ్చే వ్యక్తి కూడా మాట్లాడటమే!
అసెంబ్లీలో ఉండాల్సిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా బయట తిరుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను పోరాటం చేసేవాడినని పవన్‌ కళ్యాణ్‌ అన్నారని ఓ విలేఖరి ప్రస్తావించగా.. జగన్‌ స్పందించారు. ఇవాళ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నా కూడా మనం వినాల్సి వస్తోంది. నిజంగా ఇది మన ఖర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబుతోనూ, బీజేపీతోనూ.. ఇద్దరితోనూ కలిసి కాపురం చేశాడు. సంసారం చేశాడు తాను కూడా. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను(పవన్‌) తప్పు చేశాను కాబట్టి పూర్తిగా పతివ్రతను అని గట్టిగా చెబుతా ఉన్నాడు. ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మునున్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఆరు నెలలు ఎన్నికల ముందు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు.

ఒకరేమో తాను తప్పు చేశానంటాడు. మరొకరేమో నేను కాదు తప్పు చేసింది మిగతా ఇద్దరు నన్ను మోసం చేశారంటాడు. ఇంకో ఆయనేమో.. ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే చంపేశాను అని అంటాడు. మన ఖర్మ ఇలాంటి వాళ్లు కూడా మాట్లాడడం.. చంద్రబాబు నాలుగేళ్లు అన్యాయం చేసినా ఆయన ఏనాడు నోరు విప్పలేదు. ఆరునెలలకో, ఏడాదికో ఒకసారి బయటికి వచ్చి ఒక ట్వీటో, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతాడు. నాలుగేళ్లుగా మనం ఆయన్ను చూసింది అంతే.. ఈ నాలుగేళ్లలో కూడా పవన్‌ చేసిందేమైనా ఉందంటే చంద్రబాబును కాపాడడానికి బయటికి రావడమే. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాలు మాట్లాడితే దాన్ని గురించి మనం సమాధానం చెప్పాలంటే... నిజంగా రాజకీయాలు ఎక్కడి పోతున్నాయి? విలువల గురించి తాను మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు? నలుగురు, నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారి, ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు.. నిజంగా ఇలాంటి వ్యక్తి.. ఆయన కాకుండా నువ్వో (ప్రశ్న అడిగిన విలేఖరి), నేనో, ఇంకొకరో ఆ పని చేసి ఉంటే మనల్ని ఏమంటారు? నిత్యపెళ్లికొడుకని చెప్పి బొక్కలో వేసేవారా? లేదా? ఇది పాలిగమీ (బహుభార్యత్వం) కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటికి వచ్చి తానేదో సచ్ఛీలుడినని, ఇంకొకటో ఇంకొకటో అని మాట్లాడడం.. వాళ్లను కూడా మనం సీరియస్‌గా తీసుకుని విశ్లేషించుకోవాల్సి రావడం అంటే రాజకీయాల్లో నిజంగా బాధనిపిస్తుంది’’ అని జగన్‌ పేర్కొన్నారు.  

– నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నా. మీరే ముందుకొచ్చి, మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి, దేశం మొత్తం మనవైపు చూసేలా చేసి, స్వయంగా బంద్‌లో పాల్గొనాల్సిన పరిస్థితిలో నువ్వు చేసిన నిర్వాకం ఇదా? అవిశ్వాస తీర్మానంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే.. కేంద్రమేమో మీ వల్లే హోదా ఇవ్వలేదని చెబుతుంటే మీరు ఒప్పుకున్నారు. మీరు అడిగారనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని వాళ్లు చెబితే నిరసన తెలపాల్సిందిపోయి.. బీజేపీకి వ్యతిరేకంగా, 25కు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వస్తుందని తెలిసినా.. దాన్ని నీరుగార్చిన నీ మోసానికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?

– చంద్రబాబును గట్టిగా ఓ విషయం అడగండి.. అయ్యా చంద్రబాబూ.. స్వాతంత్య్రానికి ముందు నువ్వు ఓ నాయకుడిగా లేకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం. నువ్వు గనుక స్వాతంత్య్రానికన్నా ముందు ఓ నాయకుడిలా ఉండుంటే.. ఎందుకయ్యా స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేస్తున్నారు? బ్రిటీష్‌ వాళ్లు బాగానే చేస్తున్నారు కదా? ఒక ప్యాకేజీ తీసుకుని సర్దుకుపోదామని అనుండేవారు. 

సంబంధిత కథనాలు:

కుట్ర భగ్నం.. బంద్‌ విజయం

ఉక్రోషం.. ఉక్కుపాదం

ప్రతిపక్ష పార్టీ బంద్‌ చేయకూడదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement