బంద్ సందర్భంగా మంగళవారం నిర్మానుష్యంగా మారిన విజయవాడలోని బందరు రోడ్డు
ప్రజా సంకల్పం ముందు సర్కారు ఎత్తులు చిన్నబోయాయి. బంద్‌ను నిర్వీర్యం చేయాలనుకున్న ప్రభుత్వ పెద్దల పాచిక పారలేదు. పోలీసులను ఎంతగా ఉసిగొల్పినప్పటికీ ప్రజలు రోడ్లపైకొచ్చి హోదా కావాల్సిందేనంటూ పిడికిళ్లు బిగించారు. ఎక్కడికక్కడ దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది.
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. మంగళవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేశారు. హోదా ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు వినిపించేలా గట్టిగా నినదించారు. హోదా సాధనలో సీఎం చంద్రబాబు చేసిన మోసం, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని హోదాపై ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. షాపులు మూతబడ్డాయి. స్కూళ్లు తెరుచుకోలేదు.
పెట్రోల్ బంక్‌లను కూడా మూసివేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే.. హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. బంద్‌ను విఫలం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను గృహనిర్భందంలో ఉంచారు. వందలాది మందిని అరెస్టులు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. అయినా హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజలు ఢిల్లీకి సెగ తగిలేలా.. ప్రతిపక్షానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా బంద్‌ను సంపూర్ణం చేశారు. బంద్‌లో వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాకి దుర్గారావు గుండెపోటుతో మృతి చెందాడు. అన్ని జిల్లాల్లో పోలీస్ యాక్ట్‌తో పాటు 144 సెక్షన్ విధించి ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించారు.
రోడ్లు దిగ్బంధం..డిపోల్లోనే బస్సులు
ప్రభుత్వ అణచివేత చర్యలతో ప్రజలు రగిలిపోయారు. రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. తెల్లవారుజామునే వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు బస్టాండ్‌లకు చేరుకున్నారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులన్నీ బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇతర నేతలో కలసి విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్‌కాంప్లెక్స్ ఎదురుగా హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మరో సీనియర్ నేత, శాసనమండలి ఫ్లోర్‌లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నేతలతో కలసి జగదాంబ సెంటర్ నుంచి డాబాగార్డెన్స్ వరకు పాదయాత్ర చేశారు. నెల్లూరులో భారీఎత్తున బైక్ భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమలోని బస్టాండ్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేసి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస ఆర్టీసీ డిపోల ముందు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితర వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏలూరులోని ఆర్‌టీసీ బస్ డిపో వద్ద ఉదయం నుంచే నాయకులు బైఠాయించి బస్సులను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు.
మూతపడ్డ వ్యాపార సంస్థలు
హోదా కోసం జరిగిన బంద్‌కు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, విద్యాసంస్థల అధిపతులు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చిన్న చిన్న షాపులు కూడా తెరచుకోలేదు. దుకాణాలు మూతబడ్డాయి. తోపుడు బళ్ల వ్యాపారులు కూడా బంద్‌లో పాల్గొని తమ వ్యాపారాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. అధికారుల ఆదేశాలతో పలు జిల్లాల్లో ప్రభుత్వ బడులు తెరిచినా విద్యార్థులు లేక ఖాళీగా ఉండిపోయాయి. చాలా చోట్ల బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో తొలి రెండు ఆటలను నిలిపివేశారు.
రాజధానిలో స్తంభించిన జనజీవనం
రాజధాని ప్రాతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వాణిజ్య రాజధానిలో వర్తక, వాప్యార కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో 150కు పైగా హోల్‌సేల్ అసోసియేషన్లకు చెందిన వెయ్యికుపైగా దుకాణాలు మూతబడ్డాయి. ఆటోనగర్‌లో పారిశ్రామిక యూనిట్లు పనిచేయలేదు. వైఎస్సార్‌సీపీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి తదితర పార్టీ నేతలు ఉదయం 5గంటలకే నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బస్సులు కొన్నింటిని తిప్పారు. అయినా జనంలేక అవి బోసిపోయాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సంఘీభావం తెలిపాయి.
మరోపక్క గుంటూరులో బంద్ సంపూర్ణమైంది. పార్టీ నేతలు తెల్లవారుజామునే బస్టాండ్‌లకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ఉద్రక్త పరిస్థితులు తలెత్తకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది.
కుప్పంలో గ్రాండ్ సక్సెస్
ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో హోదా ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయింది. బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు శథవిధాల ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చంద్రమౌళిని హౌస్ అరెస్ట్ చేశారు. దుకాణదారులు, చిన్న చిన్న తోపుడుబండ్ల వ్యాపారులు, ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. దీంతో కుప్పం పట్టణంలోని వీధులన్నీ బోసిపోయాయి. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment