
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ బయటపెట్టారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి 2016 అక్టోబర్ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ.. మంగళవారం గోయల్ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ చేసిన తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్యాకేజీని స్వాగతిస్తూ 2017 మార్చి 16న ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గోయల్ ప్రస్తావించారు. ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్ జట్టుకడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రుజుమైందని గోయల్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆయనను అవమానించిన కాంగ్రెస్‌తో జట్టు కట్టడం దుర్మార్గమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
మీకు హైదరాబాద్‌లో ఆస్తులు లేవా..
ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు తెలుగు రాష్ట్రల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చులు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి హైదరాబాద్‌లో ఆస్తులు లేవా అని ప్రశ్నించారు. పక్కవారిని తిట్టడానికే ఆయన అనుభవం ఉపయోగపడుతోందని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతారని మంత్రి లోకేష్ కనీస అవగహన లేకుండా మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా బీజేపీ మ్యానిఫెస్టో ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. తన రాజకీయ స్వలాభం కోసమే చంద్రబాబు నాయుడు.. మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment