
సాక్షి, నల్గొండ : తెలంగాణ ప్రజలకు వంచించడం చేతకాదని, అందుకే ప్రతీసారీ మోసపోతున్నామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా వెనుకబడిందేనని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమగ్రంగా వివరిస్తూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు లేఖ రాశానని గుర్తు చేశారు. అన్ని వనరులతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. వెనుకబడిన తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు.
అధిష్టానంపై ఒత్తిడి తీసుకురండి..
ఏపీకి హోదా కల్పిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తోంటే తెలంగాణ గురించి మాట్లాడకుండా ఏం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుత్తా ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చాలని ఎంపీలు అడగలేక పోవడానికి కారణాలేంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా నోరు తెరచి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment