సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంపై చంద్రబాబు సర్కారు మరోసారి ఉక్కుపాదం మోపింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌పిలుపును భగ్నం చేయడానికి సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. బంద్‌ను అడ్డుకునేందుకు అన్నిజిల్లాలలో పోలీసులను మోహరించింది. పోలీసుల ఆంక్షలను, సెక్షన్లను లెక్కచేయని జనం ఎక్కడికక్కడ రోడ్డెక్కి ప్రత్యేకహోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. బీజేపీ టీడీపీల మోసపూరిత వైఖరిని ఎండగట్టారు.
ఏపీ వ్యాప్తంగా పోలీసుల రాజ్యం నడిచింది. కనపడిన ప్రతి వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించారు. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితోపాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాజంపేటలో అమర్‌నాథ్ రెడ్డిని, జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎంపీ వరప్రసాద్, వెంకటగిరిలో జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురిని అరెస్ట్ చేశారు.
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడలో పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, వంగవీటి రాధాకృష్ణ, బొప్పన, అడపా శేషు, మహమ్మద్‌లను అరెస్ట్ చేశారు. అలాగే విద్యాధరపురం వద్ద వెల్లంపల్లితోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం ఉద్రిక్తలకు దారితీసింది.
విజయనగరం బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ కోలగట్ల, మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం డిపో వద్ద జోగారావులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గుంటూరు బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి, రేపల్లెలో మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు విశాఖ మద్దిలపాలెంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు పలువురు నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కలికిరినూ పోలీసులు రెచ్చిపోయారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసన చెబుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. విచక్షరహితంగా కొట్టడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment