ఉద్యమాన్ని కొనసాగిస్తాం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Owes To Continue Special Status Movement After Bandh Succeded | Sakshi
Sakshi News home page

బంద్‌ సక్సెస్‌.. ఉద్యమాన్ని కొనసాగిస్తాం : వైఎస్‌ జగన్‌

Published Tue, Jul 24 2018 8:24 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YS Jagan Owes To Continue Special Status Movement After Bandh Succeded - Sakshi

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, తూర్పుగోదావరి(సామర్లకోట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ మంగళవారం స్వచ్ఛందంగా ఏపీ బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బంద్‌ సక్సెస్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి కిరాతకంగా, అతి దారుణంగా సీఎం చంద్రబాబు నాయుడు బంద్‌ను విఫలం చేయడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. అన్ని కుట్రలు, అణచివేతల మధ్య కూడా బంద్‌ విజయవంతమైందని తెలిపారు. బంద్‌లో పాల్గొని ‘ప్రత్యేక హోదా అన్నది మా హక్కు’ అని చాటినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. 

బంద్‌ను నీరుగార్చేందుకు, బలవంతంగా ఆర్టీసీ బస్సులను సైతం తిప్పడానికి చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. హోదా కోసం ముందుకొచ్చి ఎంపీలతో రాజీనామాలు చేయించి దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేసి, మీరే బంద్‌లో పాల్గొనాల్సింది పోయి మీరు చేసే నిర్వాకం ఇదా అంటూ చంద్రబాబును వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ప్రత్యేక హోదా కావాలని తన స్వరం వినిపించేందుకు వచ్చిన కాకి దుర్గాప్రసాద్‌ మరణించడానికి కారణం మీరు కాదా? అని ప్రశ్నించారు. పోలీసు జులుం ద్వారా దుర్గాప్రసాద్‌ గుండెపోటుతో మరణించేలా చేశారని అన్నారు. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

హోదా కోసం నిరసనలు తెలుపుతున్న వారిని కాలర్‌ పట్టుకుని ఈడ్చుకుంటు వెళ్లారని, లాఠీ చార్జ్‌లు జరిపారని, మహిళలను అని కూడా చూడకుండా పురుష పోలీసులు వారిని నిర్భందించారని, విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్తున్న ఫొటోలను వైఎస్‌ జగన్‌ మీడియా ప్రతినిధులకు చూపించారు. అయినప్పటికీ ప్రజలు బంద్‌ను విజయవంతం చేయడం హోదా ఆకాంక్షిస్తున్న ప్రజల మనోభావలను తెలియజేస్తుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వంద తప్పుల తర్వాత శిశుపాలుడికి కూడా శిక్ష తప్పదన్నట్లుగా చంద్రబాబు కూడా కచ్చితంగా శిక్ష పడి తీరుందన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులను సీఎంగా చంద్రబాబు నిర్వర్తించకపోవడమేనని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలుగా మనం అందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాటం ఇక్కడితో ఆగదని, దాన్ని సాధించే వరకూ ఒత్తిడిని కొనసాగిస్తామని వెల్లడించారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ముందుకు రావాలని కోరారు. భావితరాలు బాబును చరిత్ర హీనుడిగా చూస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. రాజకీయ స్వార్థంతోనే కొందరు బంద్‌లో పాల్గొనలేదని చెప్పారు. హోదాపై పోరులో భాగంగా ఎవరు పిలుపు ఇచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. హోదా అన్నది వ్యక్తిగత స్వార్ధాల కోసం చూసుకునేది కాదు, రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటై సాధించాల్సిందని పునరుద్ఘాటించారు. 

‘కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కాకుండా ప్రజలు ఇబ్బందులు పడేలా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై.. మీరు స్వతంత్రానికి ముందు ఒక నాయకుడిగా లేకపోవడం(చంద్రబాబును ఉద్దేశించి) భారతదేశం చేసుకున్న ఒక అదృష్టం అయ్యా. నువ్వు గనుక అప్పట్లో ఉండివుంటే ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తున్నారు. బ్రిటీష్‌ వాళ్లు బాగానే పాలిస్తున్నారు కదా. ఒక ప్యాకేజి తీసుకుని సర్దుకుపోదామని చెప్పివుండే వాడివయ్యా అని చంద్రబాబుకు చెప్పాలి.

ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదనే మరో ఆరోపణపై స్పందిస్తూ.. 2016 సెప్టెంబర్‌లో ప్యాకేజి స్టేట్‌మెంట్‌ వచ్చింది. చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి ధన్యావాదాలు తెలిపారు. మరుసటి రోజు నేను మీడియా సమావేశం పెట్టాను. ఒకసారి ఆ రికార్డును పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం చెవిలో క్యాలీఫ్లవర్‌ పెడుతోందని తిడుతూ మాట్లాడాను. ఏపీ అసెంబ్లీలో ప్యాకేజీ ఇవ్వడంపై ధన్యవాద తీర్మానాన్ని వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకించింది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జగన్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంటే ఏంటో ట్యూషన్‌ చెప్పాడు. 

ఇవాళ చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలసి నడిచి, ఎన్నికలు ఆరు నెలల ముందు విడాకులు తీసుకుని, హోదా కోసం ఆయనే పోరాటం చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారు. మోదీ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలను సభలలో చంద్రబాబు వినిపిస్తున్నారు. హోదా కోసం నేను చేసిన యువభేరీ సభలను చూడండి. ప్రత్యేక హోదా కోసం జగన్‌ చేసిన ధర్నాలు, నిరాహార దీక్షల ఫుటేజీలను పరిశీలించండి. యువభేరీల్లో మోదీ ఏం మాట్లాడారు. వెంకయ్య నాయుడు ఏం మాట్లాడారు. చంద్రబాబు ఏం మాట్లాడారు. ఊసరవెల్లుల్లా రంగులు ఎలా మార్చారు వంటి అన్నీ విషయాలను చెప్పాను.

హోదా కోసం ఎన్నికలకు 15 నెలల ముందే రాజీనామా చేశాం. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలుత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వైఎస్‌ జగన్‌ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఏపీ ప్రజల తరఫున కేంద్రంలో ఎవరున్నా లెక్కచేయకుండా పోరాటం చేస్తుంటే నిందలు వేస్తారు. మరొవైపు ఇదే చంద్రబాబు పూటకో మాట మాట్లాడతాడు. గంటకో వేషం వేస్తాడు. ఎన్నికలకు ముందు హోదా 10 కాదు 15 ఏళ్లు తెస్తానంటాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు హోదా వల్ల ఏం బాగుపడ్డాయని ప్రశ్నిస్తాడు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతూ అదే పార్టీకి చెందిన నాయకుడి భార్యకు టీటీడీలో బోర్డు మెంబర్‌గా పదవి ఇస్తాడు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను తన కొలువులో పెట్టుకున్నాడు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటాడు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉంటే వెంకయ్య పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంటాడు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి, దీక్షలకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు చూసేది కాదా?. ఇవన్నీ వాస్తవాలు అని తెలిసినా చంద్రబాబు ఒకవైపు బీజేపీతో తన చెలిమిని కొనసాగిస్తాడు. కాంగ్రెస్‌ను మేనేజ్‌ చేస్తాడు. ప్రజలను గొప్పగా మోసం చేస్తాడు.

చంద్రబాబు చేసేవి ధర్మపోరాట సభలు కావు. అవి అధర్మపోరాట సభలు. ఈ విషయంపై చంద్రబాబును తనను తాను ప్రశ్నించుకోమని చెప్పండి(మీడియా ప్రతినిధులను ఉద్దేశించి). మన కర్మ ఏంటంటే ఇవాళ పవన్‌ అనే వ్యక్తి మాట్లాడుతున్నా వినాల్సివస్తోంది. నిజంగా ఇది మన కర్మ. నాలుగేళ్లు టీడీపీ, బీజేపీతో కలసి నడిచాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయనా బయటకు వచ్చి నేను తప్పుచేశాను అని చెప్పి చెబుతున్నారు. ఒక మనిషిని ముగ్గురు కలసి పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి బయటకు వచ్చి ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడతారు. మన కర్మ ఇలాంటి వాళ్ల కూడా ఉన్నారు. ఆరు నెలలకు ఒకసారి వచ్చి ట్వీట్‌ ఇవ్వడం, ఇంటర్వూలు ఇవ్వడం చేశారు. గత నాలుగేళ్లలో మనం చూశాం. చంద్రబాబును రక్షించేందుకే అలా పవన్‌ వచ్చారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలుపెడితే ఎలా?.’ అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

బంద్‌ గురించి వైఎస్‌ జగన్‌ వెల్లడించిన వివరాలు..

శ్రీకాకుళం
జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది అరెస్టు అయ్యారు. తమ్మినేని సీతారాం, కృష్ణదాసు, అప్పలరాజు, తిలక్‌ వంటి కీలక నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్‌ 144, సెక్షన్‌ 30లను విధించారు. బంద్‌ను ఉక్కుపాదంతో అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు.
 
విజయనగరం
ఇక్కడ కూడా 300 మందికి పైగా అరెస్టు చేశారు. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

విశాఖపట్టణం
బొత్స సత్యనారాయణ సహా సీనియర్‌ నాయకులందరినీ అరెస్టు అయ్యారు. షాపులు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

తూర్పు గోదావరి
వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. నాయకులు కన్నబాబు, జగ్గిరెడ్డి, ద్వారపూడి, వీర్రాజు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నేతలను అదుపులోకి తీసుకుని బస్సులను నడిపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ 538 మంది అరెస్టు చేశారు. వీరిలో 38 మందిపై కేసులు పెట్టారు.

పశ్చిమ గోదావరి
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నానిలను ఏలూరు అరెస్టు చేశారు. తణుకులో కారుమూరి తదితర సీనియర్‌ నాయకులను అరెస్టు చేశారు. బుట్టాయిగూడెంలో ధర్నాలో పాల్గొన్న కాకి దుర్గారావు అనే సోదరుడు గుండెపోటుతో మరణించాడు. జిల్లాలో 300లకుపైగా అరెస్టులు అయ్యాయి.

ప్రకాశం
144 సెక్షన్‌ను జిల్లా వ్యాప్తంగా అమలు చేశారు. కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. బాలినేని వాసు మొదలుకుని మాజీ మంత్రి మహిధర్‌ రెడ్డి వరకూ అరెస్టులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 600 మందికి పైగా అరెస్టు అయ్యారు. అయినా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడి బంద్‌ను విజయవంతం చేశాయి.

నెల్లూరు
కోటంరెడ్డి శ్రీధర్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, రాం రెడ్డి ప్రతాప్‌ తదితర నాయకులు అరెస్టు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 800 మందిపైగా అరెస్టు అయ్యారు. అయినా బంద్‌ స్వచ్ఛందంగా జరిగింది.

కర్నూలు
సీనియర్‌ నాయకులు అందరూ అరెస్టు అయ్యారు. నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. మహిళా పోలీసులు లేకుండా వారిని లాగడంతో వారికి గాయాలయ్యాయి. కర్నూలులో దాదాపు 600 మంది అరెస్టు అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు బంద్‌ను పాటించారు.

వైఎస్సార్‌ కడప
ఎక్కడిపడితే అక్కడ అరెస్టులు జరిగాయి. మొత్తం 1500 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఆర్టీసీ బస్టాండ్‌లో అడ్డుకున్నందుకు మేయర్‌ సురేష్‌, ఆకేపాటి అమర్‌లను అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో శివాలయం ఎదుట ఎమ్మెల్యే రాచమల్లు భిక్షాటన చేయగా అరెస్టు అయ్యారు.

అనంతపురం
సీనియర్‌ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి గృహ నిర్భందం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా అరెస్టు అయ్యారు. స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

చిత్తూరు
భూమన కరుణాకర్‌ రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డిలతో పాటు సీనియర్‌ నాయకులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1200 మంది అరెస్టు అయ్యారు. కుప్పంలో కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్‌ను పాటించాయి. ప్రత్యేక హోదా కావాలన్న నినాదం చివరకు కుప్పంలో కూడా వినిపిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదు.

కృష్ణా
సీనియర్‌ నాయకులు అందరూ అరెస్టు అయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు పార్థసారధి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బాబు కుమార్‌, వంగవీటి రాధా, కార్పొరేటర్లు అందరినీ బస్‌స్టాండ్‌ వద్ద అరెస్టు చేశారు. జిల్లాలో దాదాపు 600 మంది అరెస్టు అయ్యారు.

గుంటూరు
సీనియర్లు అందరూ అరెస్టు అయ్యారు. జిల్లాలో దాదాపు 1100 మందిని అరెస్టు చేశారు. అయినా కృష్ణా, గుంటూరులలో బంద్‌ విజయవంతమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement