బంద్‌కు సంఘీభావంగా సోమవారం తిరుపతిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా నేడు (మంగళవారం) రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు బంద్ నిర్వహణకు సన్నద్ధమయ్యాయి. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని జగన్ ఇప్పటికే అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పార్టీ నేతలు కూడా పలు ప్రజా సంఘాలను, పార్టీలనూ సంప్రదించి మద్దతును కోరారు. కాగా, బంద్ నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్.. మంగళవారం తన యాత్రకు విరామం ప్రకటించారు. యాత్రా శిబిరం నుంచి ఆయన బంద్‌ను పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మండల కేంద్రాల్లోని వర్తక, వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులను పార్టీ నేతలు కలుసుకుని బంద్‌కు మద్దతు ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే, బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గ కేంద్రాలు.. జిల్లా కేంద్రాల్లో స్థానిక కార్యకర్తలు, నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించారు.
ఈ తరుణంలో బంద్‌ను విజయవంతంగా చేయాల్సిన అవసరం, హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడం.. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలపై పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతల వినతిని అనుసరించి ప్రజలు కూడా మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపేందుకు కృతనిశ్చయంతో ముందుకు కదులుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం గత నాలుగేళ్లుగా తమ పార్టీ ముందుండి పోరాడుతున్న తీరును, పార్లమెంటులోనూ, బయటా చేస్తున్న ఆందోళనలనూ ఈ సందర్భంగా పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్ చేసిన దీక్ష, పార్టీ పలుమార్లు చేసిన ఆందోళనలను ప్రజలకు తెలిపే యత్నం చేస్తున్నారు.
బయటపడ్డ టీడీపీ డొల్లతనం
ఇదిలా ఉంటే.. గత శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంలో ప్రత్యేక హోదాపట్ల టీడీపీకి గల చిత్తశుద్ధిలోని డొల్లతనం బయటపడిందని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదాను కాలరాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వైపు ప్రయత్నిస్తే , హోదావల్లే రాష్ట్రం బాగుపడుతుందని జగన్ చేసిన పోరాటంతోనే అదొక సెంటిమెంట్‌లాగా తయారైన విషయాన్ని కూడా పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు బంద్ ముందస్తు సన్నాహాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. యువకులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, మేధావి వర్గాల నుంచి స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు వ్యక్తమవుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల సత్తా ఏమిటో అటు కేంద్రానికి, ఇటు చంద్రబాబుకు తెలిసేలా చేయాలని కోరారు.
బాబు పిలుపు ప్రజలకు వెన్నుపోటు
– విజయసాయిరెడ్డి ట్వీట్
ప్రత్యేక హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొన వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం రాష్ట్ర ప్రజలకు ఆయన వెన్నుపోటు పొడవటమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సోమవారం ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మన ముఖ్యమంత్రి చేతిలో కత్తి.. పోరాటానికి కాదు, వెన్నుపోటుకు అలవాటుపడింది. రాష్ట్ర ప్రజలను 2014–18 మధ్య రోజూ వెన్నుపోటు పొడుస్తున్నారు. మంగళవారం నాటి బంద్‌లో పాల్గొనవద్దని చంద్రబాబు ఇచ్చిన పిలుపు.. తెలుగు జాతిని ఆయన ఎంత అలవోకగా వెన్నుపోట్లు పొడవగలడో చెప్పడానికి మరో ఉదాహరణ మాత్రమే’ అని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
అన్ని జిల్లాల్లో బంద్‌కు సన్నాహాలు
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా బైక్ ర్యాలీలు, సమావేశాలు, కొవ్వొత్తుల ర్యాలీల ద్వారా బంద్‌కు విస్తృత ప్రచారం కల్పించారు.
– గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు రావి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ పార్టీ నేతలతో సమావేశమై బంద్ ఆవశ్యకతను వివరించారు. గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య పాల్గొన్నారు. ముస్తాఫా కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. అచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు ఆదినారాయణ బైక్ ర్యాలీ నిర్వహించారు.
– బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యేక హోదాపట్ల ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. బంద్‌కు మద్దతుగా గోపాలపురం, చింతలపూడిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
– అనంతపురంలో సోమవారం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య.. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
– విశాఖ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పూడిమడక రోడ్డు జంక్షన్ నుంచి అనకాపల్లిలో బైకు ర్యాలీచేశారు. విజయనగరం జిల్లాలోని పలు మండలాలతోపాటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, పలాసలో స్థానిక నేతలు ర్యాలీలు, పాదయాత్ర చేశారు.
– వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు పార్టీ సమావేశాలు నిర్వహించారు.
తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ
బంద్‌కు వివిధ వర్గాల సహకారం కోరుతూ వైఎస్సార్‌సీపీ సోమవారం తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌సీపీ యువనేత భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరువేల మంది, మూడు వేల బైక్‌లతో సాగిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణం నుంచి ర్యాలీ కదిలింది. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా అభినయ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పుత్తూరులో బంద్ ఏర్పాట్లను ఎమ్మెల్యే రోజా పర్యవేక్షించారు.
సహకరించండి : ఆర్టీసీ ఎండీకి వినతి
బంద్‌కు విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలో వర్తక, వాణిజ్య, కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. బంద్‌కు సహకరించాలంటూ పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు ఆర్టీసీ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబును సోమవారం కలిసి కోరారు. ఈ బంద్‌కు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కాగా, బంద్‌ను జయప్రదం చేయాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, బ్రాహ్మణ అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు టీవీకేఎస్ శాస్త్రి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment