
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్‌సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైఎస్సార్‌సీపీయేనని చెప్పారు. శ్వేతపత్రాలతో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్‌సీపీయేనని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తూర్పారబట్టారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాదని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment