సాక్షి, ఏలూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందారు. టీడీపీ ప్రభుత్వం కుట్ర వల్లే దుర్గారావ్ మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దుర్గారావు మృతితో ఆయన స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజు నిజం మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం శాంతియుతంగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండిపడ్డారు. పోలీసుల తోపులాట వల్లే వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు మరణించారని తెలిపారు. ఈ ఘటన చూస్తుంటే ఇది ప్రభుత్వ హత్యలా అనిపిస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దుర్గారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దుర్గారావు మృతదేహానికి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాళులు ఆర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment